Hyderabad: ఆ యూనివర్సిటీలో డ్రగ్స్ గబ్బు – 50 మంది విద్యార్థులకు పాజిటివ్
హైదరాబాద్ మహీంద్ర కాలేజీలో డ్రగ్స్ గబ్బు లేచింది…! పుస్తకాలు పట్టాల్సిన విద్యార్థులు… మత్తుకు చిత్తవుతున్నారు. మంచి భవిష్యత్ ఉన్నవాళ్లు డ్రగ్ అడిక్ట్‌గా తయారవుతున్నారు. కొంపల్లి డ్రగ్స్ కేసులో కూపీ లాగితే డొంక కదులుతోంది. మహీంద్ర వర్సిటీ కేసులో వెలుగులోకి వస్తున్న వాస్తవాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.
మత్తుగాళ్ల తుక్కురేగ్గొడతాం…! గ్రాము దొరికినా గుండు పగలగొడతాం…! డ్రగ్స్ సప్లై చేశారో చచ్చారే అంటూ యమా దూకుడు మీదున్న అధికారులు… మరో ముఠా గుట్టురట్టుచేశారు. అయితే ఇప్పుడు అరెస్టైన వాళ్లు మామూలోళ్లు కాదు… బడా కాలేజీల్లో చదువులు వెలగబెడుతున్న విద్యార్థులు. భవిష్యత్ బాగుండాలని లక్షలకు లక్షలు ఖర్చు చేసి తల్లిదండ్రులు చదివిస్తుంటే బుక్స్‌ను పక్కనపెట్టి డ్రగ్స్ పట్టిన మేథావులు.
పక్కా సమాచారంతో మహీంద్ర యూనివర్సిటీలో సోదాలు చేశారు అధికారులు. లోకల్ పెడ్లర్లతో కలిసి ఇద్దరు విద్యార్థులు యూనివర్సిటీలో ప్రతిరోజూ వందలాది మందికి డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పెడ్లర్లకు ఢిల్లీ నుంచి కొరియర్ల రూపంలో డ్రగ్స్ వస్తున్నట్లు తేల్చారు. 50 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు. గతంలో నైజీరియన్ నిక్ నుంచి MDMA కొనుగోలు చేసి పలు పబ్‌లలో విద్యార్థులు పార్టీలు కూడా చేసుకున్నట్లు తేల్చారు. అలాగే కిలోన్నర గంజాయి, 47 గ్రాముల ఓజీ వీడ్ స్వాధీనం చేసుకోవడంతో పాటు పెడ్లర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీళ్ల ద్వారా మరికొంతమంది బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు.
ఇటు కొరియర్ కంపెనీ పాత్రపైనా దర్యాప్తు చేపట్టారు అధికారులు. ఇన్నిసార్లు కాలేజీకి కొరియర్స్ వస్తుండటంలో కంపెనీ పాత్ర ఏమైనా ఉందా అని అనుమానిస్తున్నారు. పదేపదే ఒకే ప్లేస్ నుంచి కొరియర్ వస్తున్నప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కొరియర్ కంపెనీలకు ఉందంటున్నారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌పై దృష్టి పెట్టామన్న నార్కోటిక్ ఎస్పీ రూపేష్… పిల్లలపై తల్లిదండ్రులు కూడా దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
కొన్ని నెలల క్రితం అధికారులు చేధించిన కొంపల్లి డ్రగ్స్ కేసు గుర్తుందా…? మల్నాడు రెస్టారెంట్ మాటున డ్రగ్స్ దందా నడిపించిన సూర్య గుర్తున్నాడా…? అతని విచారణలోనే ఈ మహింద్రా యూనివర్సీటీలోని డ్రగ్స్ గబ్బు బయటకొచ్చింది. మల్నాడు రెస్టారెంట్‌కి వచ్చినట్లు మహీంద్ర వర్సిటీకి కొరియర్లు రావడంతో రంగంలోకి దిగిన అధికారులు గుట్టురట్టు చేశారు. అలాగే కొంపల్లి డ్రగ్స్ కేసులో ఇప్పటికే పెద్ద ఎత్తున అరెస్టులు జరగ్గా… వారందరిని విచారిస్తున్నారు. ఇంకొంతమంది బయటకొచ్చే అవకాశం ఉందంటున్నారు.