Devaragattu Bunny Utsavam : కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం, హింసను అరికట్టేందుకు పోలీసుల ప్రయత్నం!

 Devaragattu Bunny Utsavam : కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధం, హింసను అరికట్టేందుకు పోలీసుల ప్రయత్నం!

Devaragattu Bunny Utsavam : దేవరగట్టు కర్రల సమరానికి రంగం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి బన్ని ఉత్సవం నిర్వహణకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. కర్రల యుద్ధంలో హింసను తగ్గించేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Devaragattu Bunny Utsavam : కర్నూలు జిల్లా ఆలూరు సమీపంలోని దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది. ఏటా దసరా పండుగ రోజున బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవంలో అర్ధరాత్రి వేళ మాళమల్లేశ్వర స్వామిని దక్కించుకునేందుకు స్థానిక గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు. సంప్రదాయం పేరిట జరిగే ఈ కర్రల యుద్ధానికి రంగం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి బన్నీ ఉత్సవానికి దేవరగట్టులో ఏర్పాట్లు చేశారు. ఏటా కర్రల సమరంలో తలలు పగిలి నెత్తురుమయంగా మారుతుంది. అయితే ఈ వేడుకను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

బన్ని ఉత్సవం నేపథ్యం
దేవరగట్టు గ్రామంలోని కొండపై మాళ మల్లేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలోని మాళమ్మ, మల్లేశ్వరస్వామికి దసరా పండుగ రోజున అర్ధరాత్రి 12 గంటలకు కల్యాణం నిర్వహిస్తారు. అనంతరం కొండకు సమీపంలోని పాదాలగుట్టు, రక్షపడ, శమీవృక్షం, బసవన్నగుడి ప్రాంతాల్లో దివిటీల వెలుతురులో మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను ఊరేగిస్తారు. ఈ ఉత్సవ విగ్రహాలను దక్కించుకోవటం కోసం మూడు గ్రామాల ప్రజలు ఓ వర్గంగా, ఐదు గ్రామాల ప్రజలు మరో వర్గంగా ఏర్పడి కర్రలతో దాడిచేసుకుంటారు. దీన్నే స్థానికంగా బన్ని ఉత్సవం అని పిలుస్తారు. ప్రతీ ఏటా దసరా నాడు జరిగే కర్రల సమరంలో పదుల సంఖ్యలో గాయపడతారు. తలలు పగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ లేకపోలేదు. అయినా ఇదంతా తమ ఆచారంలో భాగమని స్థానికులు అంటారు. రక్తం కారుతున్నా లెక్కచేయకుండా ఉత్సవ విగ్రహాల కోసం పోటీ పడతారు.

పోలీసుల పటిష్ట బందోబస్తు
దేవరగట్టు బన్ని ఉత్సవం కోసం అధికారులు, పోలీసులు కట్టుదిట్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గాయాల తీవ్రతను తగ్గించేందుకు రింగులు తొడిగిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో మద్యాన్ని నియంత్రించేందుకు తనిఖీలు చేస్తున్నారు. మఫ్టీలో ఉన్న పోలీసులు నిఘా పెట్టారు. డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. గ్రామ శివారులో వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కర్రల సమరంలో హింసను తగ్గించేందుకు పోలీసుల చర్యలు చేపట్టారు. వైద్య ఆరోగ్య సిబ్బందిని సైతం అధికారులు రంగంలోకి దింపారు. అంబులెన్స్ లు, ప్రథమ చికిత్స కోసం ఏర్పాట్లు చేశారు. కోర్టులు, ప్రజాసంఘాలు ఏటా ఈ ఉత్సవ నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బన్ని ఉత్సవాన్ని ప్రశాంతమైన వేడుకలా నిర్వహించుకోవాలని గ్రామస్థులకు పోలీసులు సూచించారు. ఈ ఉత్సవంలో ఏటా వేల సంఖ్యల్లో భక్తులు పాల్గొంటారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *