Dasara 2025: దసరాకు దుమ్ములేపిన మందుబాబులు.. ఎక్సైజ్ శాఖకు ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందో తెలుసా?
తెలంగాణలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది దసరా పండుగ, గాంధీ జయంతి రెండూ ఒకే రోజు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మద్యం షాపులు, చికెన్, మటన్ దుకాణాలను మూయాలని ఆదేశించింది. ప్రతీ ఏడాది దసరాకు రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. అయితే.. ఈ సారి మద్యం దుకాణాలు మూసి వేయడంతో భారీగా అమ్మకాలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ అందరి అంచనాలు రివర్స్ చేశారు మందుబాబులు. దసరా నాడు రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ మూసివేయగా.. చికెన్ మటన్ దుకాణాలు మాత్రం పలు ప్రాంతాల్లో తెరిచే ఉంచినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఆయా దుకాణాలు చూసి చూడనట్లుగా వదిలేశారన్న చర్చ ఉంది.
ఇదిలా ఉంటే.. గాంధీ జయంతి నాడు దసరా రావడం బెల్ట్ షాపుల నిర్వాహకులకు భారీగా కలిసి వచ్చింది. వీరంతా రెండు రోజుల ముందే భారీగా కొనుగోళ్లు చేసి.. పండుగ నాడు భారీ ధరలకు అమ్ముకున్నారు. ఎక్సైజ్ అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ లోని మీర్ చౌక్కు చెందిన నర్సింగరావు అనే వ్యక్తి అనుమతులు లేకుండా భారీగా మద్యం నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిన్న దాడులు జరిపిన సౌత్ జోన్ పోలీసులు ఎమ్మార్పీ ధరకు షాపుల్లో మద్యం కొనుగోలు చేసి ఎక్కువకు అమ్ముతున్నట్లు తేల్చారు. అతని వద్ద 57.2 లీటర్ల మద్యాన్ని గుర్తించారు. ఈ మద్యం విలువ 60 వేలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.