CM Revanth: ఆ మాట నాకు వినపడొద్దు.. సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు
గ్రామాలకు రోడ్లు లేవనే మాట తనకు ఇక మీదట వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు.
సచివాలయంలో రీజనల్ రింగ్ రోడ్డు, ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నాగ్ పూర్-విజయవాడ కారిడార్ కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
సమన్వయంతో ముందుకు..
అటవీశాఖ, ఆర్అండ్బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ఇందుకు ప్రత్యేకంగా నియమించాలని సీఎం సూచించారు. రెండు శాఖలు సమావేశమై సంబంధిత శాఖల పరిధిలోని భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.