CM Jagan : ఇక్కడున్నది అభిమన్యుడు కాదు అర్జునుడు, ప్రతిపక్షాల పద్మవ్యూహాన్ని ఛేదిస్తాం- సీఎం జగన్
CM Jagan : ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడి ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అని సీఎం జగన్ అన్నారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు.

వచ్చే యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతిపక్షాలన్నీ ఓడాలని సీఎం జగన్ అన్నారు. ఏపీలో మరో 25 ఏళ్ల పాటు వైసీపీ జైత్ర యాత్రకు కొనసాగిస్తామన్నారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నారన్నారు. ఈసారి టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా రావన్నారు. టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ల టీడీపీ పాలనలో మంచి చేయాలనే ఆలోచన రాలేదన్నారు. చంద్రబాబు పెత్తందార్లకు మాత్రమే సీఎంగా ఉన్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, సున్నా వడ్డీ, ఎరువులు సకాలంలో అందుతున్నాయంటే జగనే గుర్తువస్తారన్నారు.
ఎక్కడ చూసినా జగన్ మార్క్ పాలనే
56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి అంటే చేసి చూపించామని సీఎం జగన్ అన్నారు. లంచాలు, వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా పారదర్శకంగా పాలన చేశామన్నారు. ప్రతి నెలా 1న ఇంటింటికి పింఛన్లు ఇస్తున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు అందిస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ విధానాలు అమలుచేస్తున్నామన్నారు. నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చామన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రతి గ్రామానికి డిజిటల్ లైబ్రరీలు, బ్రాడ్‌బ్యాండ్‌లు తీసుకొచ్చామన్నారు.