CM Chandrababu: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత అక్కడినుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని చంద్రబాబు అన్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బుధవారం ఉదయం కనకదుర్గ (Kanakadurga) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు (Special Prayers) చేయనున్నారు. తర్వాత అక్కడినుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుస్తారు. అయితే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో నూతన సంవత్సర శుభాకాంక్షలకు తెలిపేందుకు బోకేలు, శాలువాలు తేవద్దని చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు సూచించారు. కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని పార్టీ నేతలకు చెప్పారు. కాగా కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఎక్స్ వేదికగా తెలుగు ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘2025లో మీకు ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం కలగాలని కోరుకుంటున్నా. 2024లో మీరు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏర్పడిన మీ మంచి ప్రభుత్వం అందరి ఆశలు నెరవేర్చేలా అహర్నిశలు పని చేస్తోంది. కేవలం ఆరు నెలల్లోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలను ఆవిష్కృతం చేశాం. స్వర్ణాంధ్ర-2047 విజన్ సాకారమే లక్ష్యంగా పది సూత్రాల ప్రణాళిక అమలు చేస్తూ, అటు ప్రజా సంక్షేమాన్ని, ఇటు రాష్ట్రాభివృద్ధిని మీ అందరి సహకారంతో చేసి చూపిస్తాం. మీ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్ 2025’ అని పేర్కొన్నారు. ఇప్పటికే చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్థావించారు.
బొకేలు, కేక్‌లు తేవొద్దు…
నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలవటానికి వచ్చే వారెవరూ బొకేలు, పూలదండలు, కేక్‌లు, స్వీట్లు తేవొద్దని పార్టీ కార్యాలయ కార్యదర్శి పర్చూరి అశోక్‌బాబు కోరారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలోకి అనుమతించరని చెప్పారు. వాటికి అయ్యే ఖర్చుతో మొక్కలు నాటడం, పేదలకు భోజన సదుపాయం కల్పించడం, విద్యార్థులకు పెన్నులు, పుస్తకాల వంటి బహుమతులివ్వడం ద్వారా సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
మంత్రి నిమ్మల రామానాయుడు..
అలాగే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతాయి. తమ అభిమాన నాయుకుడికి న్యూ ఇయర్ విషెస్ తెలిపేందుకు కార్యకర్తలు, అభిమానులు పార్టీ ఆఫీసులకు, నేతల నివాసాలకు వెళ్తుంటారు. తమ ప్రియతమ నేతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి బొకేలు అందజేస్తుంటారు. అయితే ఏపీకి చెందిన ఓ మంత్రి మాత్రం నూతన సంవత్సరానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎవరూ రావొద్దని.. ఆ ఖర్చును పేదలకు సహాయం చేయడంలో ఉపయోగించాలని ఆదేశించారు. ఆయన ఎవరో కాదు మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu). ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నిమ్మల నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచే ఈ ఆనవాయితీ నిమ్మల పాటిస్తున్నారు. తొలిసారి మంత్రి అయ్యాక నూతన సంవత్సర సంబరాలు ఘనంగా చేయాలని ప్లాన్ చేసిన అభిమానులకు, కార్యకర్తలకు.. ఆనవాయితీ తప్పొద్దని మంత్రి చెప్పారు. కేకులు, బొకేలు, దండలు తీసుకురావద్దని.. ఆ ఖర్చును పేదవారికి సాయం చేయడంలోనే తనకు నిజమైన సంతృప్తి, ఆనందం ఉంటుందని వెల్లడించారు.