Brown Eggs: బ్రౌన్ ఎగ్స్ తినడం మంచిదేనా? వాటి రంగుకు కారణం ఏమిటి?
Brown Eggs: బ్రౌన్ ఎగ్స్, వైట్ ఎగ్స్ లో ఏవి మంచివి? అనే సందేహం తరచుగా మనల్ని ఆలోచింపజేస్తుంటుంది. బ్రౌన్ ఎగ్స్ గురించి సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Brown Eggs: మార్కెట్లో మనకు రెండు రకాల గుడ్లు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని తెల్లని రంగులో ఉంటే, మరికొన్ని మాత్రం బ్రౌన్ రంగులో ఉంటాయి. కొంతమంది బ్రౌన్ ఎగ్స్ తినడానికి ఇష్టపడితే, మరి కొందరు వైట్ ఎగ్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ రెండింటిలో ఏవి ఆరోగ్యకరమైనవి? అనే విషయాన్ని వివరిస్తున్నారు పోషకాహార నిపుణులు.
ఈ రెండిట్లో ఏది తిన్నా మంచిదే. గుడ్డు రంగును నిర్ణయించేది ఆ కోడి జాతి. కోడి జాతులను బట్టి అవి పెట్టే గుడ్ల రంగు ఆధారపడి ఉంటుంది. తెల్లని పెంకులతో గుడ్లను ఉత్పత్తి చేసే జాతులు అధికంగా అండలూసియన్, వైట్ లైఘోర్న్. అలాగే బ్రౌన్ రంగు పెంకులతో గుడ్లను ఉత్పత్తి చేసేవి గోల్డెన్ కామెట్, రోడ్ ఐలాండ్ రెడ్, గోల్డ్ చికెన్ వంటివి.
అలాగే నీలం, ఆకుపచ్చ రంగులో గుడ్లను ఉత్పత్తి చేసే కోడి జాతులు కూడా ఉన్నాయి. కాకపోతే వీటి సంఖ్య చాలా తక్కువ. బ్రౌన్ ఎగ్స్‌లో ఉండే ప్రోటోపోర్ఫిరిన్ అనే పర్ణద్రవ్యం ఉంటుంది. దీనివల్ల ఎరుపు రంగు వస్తుంది.
బ్రౌన్ ఎగ్స్ రంగుకు కారణం ఇదే
కోడి పెరిగిన పర్యావరణం, తిన్న ఆహారం, ఒత్తిడి స్థాయిలు వంటివి కూడా కోడిగుడ్డు పెంకు రంగుపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే తెల్ల గుడ్లు కన్నా బ్రౌన్ రంగు గుడ్లు ఎక్కువ నాణ్యతతో కలిగి ఉంటాయని నమ్మకం ఎక్కువ మందిలో ఉంది. మార్కెట్లో తెల్ల గుడ్లతో పోలిస్తే బ్రౌన్ ఎగ్స్ ధర అధికంగా ఉంటుంది. ధర అధికం కాబట్టి వీరి నాణ్యత కూడా ఎక్కువ అని చాలామంది భావిస్తారు.
కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే బ్రౌన్ ఎగ్స్ ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. అందుకే వాటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఆ కోళ్లను పెంచడానికి ఎక్కువ ఖర్చవుతుంది. ఆ ఖర్చును కవర్ చేయడానికి అవి పెట్టే గుడ్లను ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఉంటారు. గుడ్డు పెంకు రంగు తప్ప మిగతా పోషకాలు అన్ని రెండు రంగుల గుడ్లలో సమానంగా ఉంటాయి.
బ్రౌన్ ఎగ్స్‌లో ఉండేవి ఇవే
బ్రౌన్ రంగు గుడ్ల పరిమాణం తెల్లని ఎగ్స్‌తో పోలిస్తే కాస్త చిన్నగా ఉంటాయి. కానీ పోషకాల విషయంలో మాత్రం రెండూ సమానంగానే ఉంటాయి. అయితే బ్రౌన్ రంగు గుడ్లలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా కావాలనుకున్నవారు బ్రౌన్ ఎగ్స్ అధికంగా తినాలి.
బ్రౌన్ ఎగ్స్ పెట్టే కోళ్లు సైజులో చిన్నగా ఉంటాయి. గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి అంతా మేలే జరుగుతుంది. దీనిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. కేలరీలు పుష్కలంగా అందుతాయి. మంచి కొలెస్ట్రాల్ గుండెకు చాలా అవసరం.
ఏ రంగు కోడిగుడ్లయినా రోజుకొకటి తినమని సిఫారసు చేస్తున్నారు పోషకాహార నిపుణులు. గుడ్డులోని తెల్లసొనలో నియాసిన్, రిబోఫ్లావిన్, సోడియం, పొటాషియం, జింక్, సల్ఫర్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం, కాపర్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటాయి. గుడ్లను చల్లని ప్రదేశంలో ఉంచితే ఎక్కువ కాలం పాటూ నిల్వ ఉంటాయి. సాధారణ ఫ్రిజ్‌లో పెడితే చాలు. డీప్ ఫ్రిజ్‌లో పెట్టకూడదు.