BIG BREAKING: ”3 నెలల తర్వాతే పంచాయతీ ఎన్నికలు”

పరీక్షలు ప్రారంభం అయ్యే ఈ సమయంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే విద్యార్థులు ఇబ్బందులు పడతారని రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ఈసీకి తెలిపింది. 3 నెలల పాటు వాయిదా వేయాలని వినతి పత్రం అందించింది. పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఎలక్షన్స్ వద్దని విజ్ఞప్తి చేసింది
స్థానిక సంస్థల ఎన్నికలు 3 నెలలు వాయిదా వేయాలని తెలంగాణ సర్పంచుల సంఘం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసి వినతి పత్రం అందజేసింది. మసబ్ ట్యాంక్ లోని తెలంగాణ ఎన్నికల కమిషన్ ను సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు కలిశారు. ఇంటర్, పదవ తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలు అయ్యాక ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తే ఇంటర్, 10వ తరగతి విద్యార్థులపై పెను ప్రభావం పడుతుందన్నారు. తద్వారా ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుందని కమిషన్ కు వివరించారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు ఎన్నికలు నిర్వహించవద్దని స్పష్టం చేశారు.
తెలంగాణలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధం అవుతోంది. ఇప్పటికే డిడికేటెడ్ కమిషన్ నిన్న సీఎస్ ను కలసి రిజర్వేషన్ల వివరాలను అందించింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం మరో వారం పది రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే.. బీసీ రిజర్వేషన్లను ఎంత మేర అమలు చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. వచ్చే నెల మొదటి వారం నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహిస్తారా? లేదా మరో మూడు నెలలు ఆగుతారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.