Banana Idli Recipe : అరటితో ఇలా ఇడ్లీలు చేయండి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి
Banana Idli Recipe In Telugu : ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తింటే చాలా హెల్తీగా ఉండొచ్చు. అయితే ఇంకాస్త ఆరోగ్యం జోడించి.. అరటితో ఇడ్లీ చేయండి. చేయడం కూడా చాలా ఈజీ.
కొందరు ఉదయం పూట కొత్తగా రుచితో అల్పాహారం ఎలా చేయాలని ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం చాలా రెసిపీలు ఉన్నాయి. అయితే టేస్ట్ తోపాటుగా ఆరోగ్యం కూడా ఉండటం మంచిది. అందుకే మీ కోసం ఒక రెసిపీ ఉంది. అదే బనానా ఇడ్లీ. దీన్ని సులభమైన తయారు చేయెుచ్చు.
ఇడ్లీలు ఒకేరకంగా తిని తిని బోర్ కొట్టినవాళ్లు.. కొత్తగా అరటి ఇడ్లీ తయారు చేయెుచ్చు. ఇది చేసేందుకు పెద్దగా టైమ్ ఏం తీసుకోదు. ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది. కొంతమంది ఇళ్లలో ఈ ఇడ్లీలను తయారు చేస్తారు. ఇది తినేందుకు తియ్యగా ఉంటుంది. బెల్లం లాంటి పదార్థాలు కూడా కలపడంతో ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అరటి ఇడ్లీలను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అరటిపండు ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
అరటికాయ, ఇడ్లీ రవ్వ, కొబ్బరి, బెల్లం, ఏలకులు, నెయ్యి
ఎలా తయారు చేయాలంటే
ముందుగా ఇడ్లీ రవ్వను సిద్ధంగా ఉంచుకోవాలి. ఇడ్లీ రవ్వను ఇంట్లో తయారు చేయవచ్చు. బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. 5-6 గంటల తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. లేదంటే ఇడ్లీ రవ్వను దుకాణంలో కూడా కొనొచ్చు.
మిక్సీ జార్లో 5-6 పచ్చి అరటిపండ్లను కట్ చేసి, దానికి అరకప్పు బెల్లం పొడి వేసి, రెండింటినీ మెత్తగా రుబ్బుకోవాలి. తీపి కావాలంటే ఇంకా బెల్లం వేయాలి. అరటిపండు పేస్ట్ 2 కప్పులు ఉండాలి. దీన్ని ఒక కప్పు ఇడ్లీ రవ్వతో కలపండి. అరకప్పు కొబ్బరి తురుము, కొంచెం యాలకుల పొడి, చిటికెడు ఉప్పు వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి.
మీరు ఈ పిండి మిశ్రమాన్ని ఒక గంట పాటు మూత పెట్టి పక్కన పెట్టాలి. తర్వాత, ఇడ్లీ పిండి గట్టిపడిందో లేదో చెక్ చేయండి. మరీ చిక్కగా ఉంటే కొంచెం నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌పై నెయ్యి వేయండి. తర్వాత దానిపై పిండి వేసుకోవాలి.
ఇడ్లీ పాత్ర అడుగున కొంచెం నీళ్ళు పోసి, ఇడ్లీ ప్లేట్లను వేసి మూత పెట్టాలి. అరగంట సేపు ఉడికిస్తే అరటిపండు ఇడ్లీ రెడీ. నెయ్యితో ఆస్వాదించండి.. చాలా రుచిగా ఉంటుంది.