AP TS Weather Updates : తుపానుగా మారనున్న వాయుగుండం – ఏపీకి హెచ్చరికలు జారీ, తెలంగాణలోనూ వర్షాలు
Weather Updates AP Telangana:ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తుపాన్ గా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
AP Telangana Weather: తెలుగు రాష్ట్రాలకు రెయిల్ అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఏర్పడిన వాయుగుండం… ఆదివారం తుపాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఆదివారం నాటికి తుఫాను మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొంది. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇందుకు సంబంధించి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఏపీ ప్రజలకు హెచ్చరికలను జారీ చేసింది.
సోమవారం సాయంత్రం తర్వాత తుపాన్… చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని… రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.
భారీవర్షాల నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహయం,సమాచారం కోసం 24గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ నెంబర్లను 1070, 112, 18004250101 అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణలోనూ వర్షాలు
మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్ ప్రభావంతో… ఆది, సోమవారం తేదీల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబర్ 3 నుంచి 5 తేదీల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.