AP Politics : ఏపీలో గాలి ఎటువైపు? తెలంగాణ ఫలితాలతో వ్యూహాలు మారుతాయా?

 AP Politics : ఏపీలో గాలి ఎటువైపు? తెలంగాణ ఫలితాలతో వ్యూహాలు మారుతాయా?

AP Politics : తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ప్రభావం చూపిస్తాయా? ఏపీలో పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటాయా? పీపుల్స్‌పల్స్‌ సంస్థ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

AP Politics : తెలుగు ప్రజలు ఎక్కడున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై ఆసక్తి కనబరుస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రజల మధ్య భావసారుప్యత ఉండడమే. ఐదు దశాబ్దాలకు పైగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సందర్భంలో రాజధాని హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబానికి ఏదోరకంగా సత్సంబంధాలున్నాయి. అందుకే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై ఏపీ ప్రజలు అమితాసక్తిని చూపించారు. ఈ ఎన్నికలపై ఆంధ్రాలో పెద్దఎత్తున బెట్టింగులు జరగడం, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తాను కూడా పందెం వేశానని రెండు రోజుల క్రితం ప్రకటించడం ఇందుకు నిదర్శనం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అనే చర్చ ఇప్పుడు తెలుగు ప్రజలలో, మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాల పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ఉంటాయో పీపుల్స్‌పల్స్‌ సంస్థ అధ్యయనం చేసినప్పుడు పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణలో ప్రభుత్వ మార్పు సంకేతం ఏపీలో 2024లో జరిగి అసెంబ్లీ ఎన్నికలకు ఒక సూచన అని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలతో ఆంధ్ర ప్రజలు తమను ఆదరిస్తారనే దీమాతో అధికార వైఎస్‌ఆర్‌సీపీ ఉంది. ఆంధ్రాలో కూడా కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు ఆశాజనకంగా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆశిస్తున్నట్టు పూర్వ వైభవం వచ్చే అవకాశమే లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలం, బలగం అంతా ఏనాడో వైఎస్సార్సీపీలో కలిసిపోయింది. వేర్లు తెగిన చెట్టు చిగురించే అవకాశమే లేదు! 2024 లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు నోటాతో పోటీపడటం ఖాయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

2024లో జరిగే ఏపీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ-జనసేన కూటమి మధ్య హోరాహోరీ పోటీ జరగనున్నది. 2019లో వైఎస్సార్సీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 10 శాతం ఉంది. ఇంత వ్యత్యాసాన్ని దాటడం ప్రతిపక్షాలకు అసాధ్యమని ఇన్నాళ్లు విశ్లేషకులు, వైఎస్‌ఆర్‌సీపీ నేతలు భావించారు. తెలంగాణ విషయంలోనూ ఇలాగే అంచనా వేశారు. తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌ 18.5 శాతం ఓట్ల వ్యత్యాసాన్ని పూడ్చుకోవడమే కాకుండా, మరో రెండు శాతం అధిక ఓట్లు సాధించి ఏకంగా అధికారాన్నే కైవసం చేసుకోవడం ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశం. ఈ కోణంలో చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం ఓట్ల వ్యత్యాసం రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని కాపాడకపోవచ్చు. అంతేకాక ఈసారి టీడీపీ-జనసేనతో పొత్తుపెట్టుకోవడంతో ఆ పార్టీకి ఉన్న 5.53 శాతం ఓట్లు తెలుగుదేశానికి లభించే అవకాశాలున్నాయి. 2014 లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమిగా ఏర్పడి వైఎస్‌ఆర్‌సీపీపై సాధించిన విజయాన్ని ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి.

కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపునకు ప్రధాన కారణం ఆ రాష్ట్రంలో వివిధ ప్రజాసంఘాలు ‘‘మేలుకో కర్ణాటక’’ పేరిట క్షేత్రస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా చేసిన విస్తృత ప్రచారం. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ గెలుపునకు తెలంగాణ జనసమితి, జాగో తెలంగాణ, కమ్యూనిస్టులు, వైఎస్సార్టీపీ, వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఎంజీవోలు, వివిధ సమూహాలు కీలక పాత్ర పోషించాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ కలుపుకుపోవడమే కాంగ్రెస్‌కు మేలు చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ‘సింహం సింగిల్‌గా వస్తుంది’, ‘వై నాట్‌ 175’ అంటూ వైఎస్సార్సీపీ నాయకులు మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పోకడలనే ప్రదర్శించిన బీఆర్‌ఎస్‌కి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం కోసం క్షేత్రస్థాయిలో అనేక ప్రజాసంఘాలు, మేధావులు మద్దతునిచ్చారు. దాని ఫలితమే వైఎస్‌ఆర్‌సీపీ 151 సీట్లు సాధించడం. ఈ విషయాన్ని గ్రహించకుండా అహంకారంతో అందరినీ దూరం చేసుకుంటే తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నష్టపోయినట్టే ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ కూడా నష్టపోవాల్సి వస్తుంది. టీడీపీ-జనసేన అందరినీ కలుపుకుపోతేనే అధికారానికి చేరువవుతుంది. చిన్నా చితక పార్టీలంటూ లెక్కలేసుకోకుండా, ప్రతి చినుకును ప్రవాహంలో కలుపుకుపోతేనే ప్రయోజనం ఉంటుంది. జనసేన పొత్తుతోనే సరిపెట్టుకోకుండా టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రజాసంఘాలను, సమూహాలను, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, బీఎస్పీ, లోక్‌సత్తా, దళిత సంఘాల్ని, రైతు సంఘాల్ని, మేధావులను కలుపుకుని ముందుకు నడిచినప్పుడే విజయం సాధిస్తుంది.

రాజకీయాల్లో ఎవరితో కలుస్తున్నామనేది కూడా చాలా కీలకం. తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనే సందేశం బలంగా వెళ్లడం వల్ల ఆ రెండు పార్టీలూ నష్టపోయాయి. బీజేపీతో దోస్తీ ధృతరాష్ట్రుడి కౌగిలి అన్న విషయాన్ని వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, జనసేన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. విభజన హామీలు నెరవేర్చని బీజేపీపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మణిపూర్‌ సంఘటన తరువాత క్రైస్తవ సమాజం బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ముస్లిం కూడా ఈసారి ఎట్టిపరిస్థితుల్లో బీజేపీతో జతకట్టిన పార్టీకి బుద్దిచెప్పాలని కంకణం కట్టుకున్నారు. ఈ సూక్ష్మాన్ని గ్రహించకుండా మైనార్టీల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నోటాతో పోటీపడుతూ, ఏపీలో అంటరాని పార్టీగా ఉన్న బీజేపీతో ఏ పార్టీ జతకడితే ఆ పార్టీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వైఫల్యానికి, ఓటమికి ప్రధానకారణం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే. సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఎన్నికల ముందు పలు సర్వేలు చెప్పినప్పటికీ బీఆర్‌ఎస్‌ ఒంటెత్తుపోకడలతో సిట్టుంగులకే సీట్లు ఇచ్చి చేతులు కాల్చుకుంది. ఏపీలోనూ దాదాపు 40 శాతం మంది వైఎస్సార్సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని క్షేత్రస్థాయిలోని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. వీరికి తోడు రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రతినిధులపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. వీరి పనితీరు, వ్యవహారశైలీ, అవినీతితో ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి పెను సవాల్‌ కాబోతోంది. రాబోవు ఎన్నికల్లో వీరే పార్టీకి గుదిబండగా మారబోతున్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌కి బలమైన పోల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఉందని, దానిని తట్టుకోవడం కాంగ్రెస్‌, బీజేపీ వల్ల కాదనే ప్రచారం ఎన్నికల ముందు పెద్ద ఎత్తున జరిగింది. కానీ ప్రజా వ్యతికేత ముందు పోల్‌ మేనేజ్‌మెంట్‌ పనిచేయలేదు. బీఆర్‌ఎస్‌ నాయకుల ఒంటెత్తుపోకడలతో నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య బంధం తెగిపోయింది. ‘‘నా కుమారుడికి జగన్‌ అంటే ప్రాణం. ఆయనకు కూడా ఉండాలిగా మన మీద ఉండాలని కోరుకుంటున్నా’’ అని రెండు రోజుల క్రితం వైఎస్‌ఆర్‌సీపీ అధినేతకు అత్యంత సన్నిహితులు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ప్రకటన గమనిస్తే పార్టీ అధినేతకు, నాయకులకు, కార్యకర్తలకు బంధం తెగిపోయినట్లు స్పష్టమౌతోంది. ఏపీలో వాలంటీర్లతో పోల్‌ మేనేజ్‌మెంట్‌ పటిష్టంగా జరుగుతుందని వైఎస్‌ఆర్‌సీపీ భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, దీనికి తోడు వాలంటీర్ల వ్యవస్థతో తమకు ప్రాధాన్యత కూడా తగ్గిందని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే సొంత పార్టీ మీద కోపం ప్రదర్శించడం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనబడుతోంది. ఈ పరిణామాలపై దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే వైఎస్‌ఆర్‌సీపీ తీవ్రంగా నష్టపోవడం ఖాయం.

సీఎం జగన్‌ తన మేనిఫెస్టోలోని 95 శాతం హామీలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని జగన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో జగన్‌ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అందించిన కాంగ్రెస్‌ అక్కడ ఓడిపోయిందనేది ఇక్కడ గమనార్హం. వినూత్న పథకాలతో దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న కేసీఆర్‌ కూడా తెలంగాణలో గట్టెక్కలేకపోయారు. జగన్‌ బటన్‌ నొక్కుతారు, అందరికీ డబ్బులేస్తారు. క్షేత్రస్థాయిల పరిస్థితులను గమనించినప్పుడు కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కుంటున్నారనే అభిప్రాయం ఏపీ ప్రజల్లో ఉంది. వివిధ ట్యాక్స్‌లు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ముందు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు దిగదుడుపే.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *