AP Cyclone Alert: ఏపీకి తుఫాను ముప్పు, వరి కోతలు పూర్తి చేసుకోవాలని అలర్ట్…

 AP Cyclone Alert: ఏపీకి తుఫాను ముప్పు, వరి కోతలు పూర్తి చేసుకోవాలని అలర్ట్…

AP Cyclone Alert: ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. మరో ఐదారు రోజుల్లో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. డిసెంబర్‌ 4 నుంచి 6 వరకు భారీ వర్షాలు కురవొచ్చని, వరి కోతలు సత్వరమే పూర్తి చేసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కోస్తాకు తుఫాను ముప్పు (HT_PRINT)

AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్‌, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత అది వాయవ్య దిశగా కదిలి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండనుంది. మరో ఐదారు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలను కురుస్తాయని అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉంటుందని ఐఎండీ మొదట అంచనా వేసింది.

సోమవారం దక్షిణ అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం కూడా ఆ ప్రాంతంలోనే కొనసాగుతోంది. ఐఎండీ ముందస్తు నివేదిక ప్రకారం ఈ అల్పపీడనం బుధవారానికే వాయుగుండం గాను, డిసెంబర్‌ ఒకటిన తుపాను గాను బలపడాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా ఒక రోజు ఆలస్యంగా గురువారం నాటికి వాయుగుండంగా, డిసెంబర్‌ 2న తుపానుగా మారనుంది.

ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకే తుపాను గమ్యాన్ని తెలిపే సైక్లోన్‌ ట్రాక్‌ పరిమితం కావడంతో ఈ అంచనాకు వచ్చారు. రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకే వాతావరణం పరిమితమవుతుందని పేర్కొంది.

డిసెంబరు మొదటి వారంలో తుపాను తీరం దాటొచ్చని, ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు… కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పంటలు కోత దశలో ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం తేలికపాటి వానలు కురుస్తాయని వివరించారు.

నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా రాపూరులో 8.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

తుఫాను కోస్తాంధ్ర తీరానికి సమీపంలోకి రాకపోయినా దాని ప్రభావం మాత్రం రాష్ట్రంపై ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఫలితంగా డిసెంబర్‌ 4, 5, 6 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల విస్తారంగా, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.స్టెల్లా తెలిపారు.

భారీ వర్షాలకు వరితో పాటు ఇతర పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల కోతకు వచ్చిన వరి పంటను వెనువెంటనే కోసి భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు.

తుపాను కోస్తాంధ్ర వైపు పయనిస్తే వర్షాల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వర్షాలకు ఈదురుగాలులు తోడై పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొంటున్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *