ఆర్టీసీ బస్సుల డిక్కీలను అద్దెకు తీసుకోవచ్చు.. ఒక్క ఫోన్ చేస్తే చాలు, పూర్తి వివరాలు
APSRTC Buses Trunks Rent Purpose: విజయనగరం ఆర్టీసీ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిక్కీలను అద్దెకు ఇవ్వనున్నారు. ఎస్.కోట డిపో పరిధిలో అల్ట్రా డీలక్స్, పల్లెవెలుగు బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. పార్శిల్స్, కొరియర్లను రవాణా చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు ఆర్టీసీ కార్గో సేవలు జిల్లాలో వేగంగా విస్తరిస్తున్నాయి.. అందుకే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో డోర్ టూ డోర్ సర్వీసులను కూడా ప్రారంభించనున్నారు.
హైలైట్:
- ఏపీఎస్ఆర్టీసీ వినూత్న ఆలోచన
- బస్సుల డిక్కీలు అద్దెకిస్తారు
- డిక్కీలను బుక్ చేసుకోవచ్చు

విజయనగరం జిల్లాలో ఆర్టీసీ కార్గో సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ సేవలు లాజిస్టిక్ విభాగంలో ఆదాయాన్ని రెట్టింపు చేస్తున్నాయి. విజయనగరం జిల్లాలో 2016లో రోజుకు రూ.4 వేలతో మొదలైన ఆదాయం ఇప్పుడు రూ.1.48 లక్షలకు చేరిందని అధికారులు తెలిపారు. ఈ సేవలను కాంట్రాక్టు పద్ధతిలో 18 ఏజెన్సీలకు అప్పగించారు.. వారికి 15 శాతం కమీషన్ ఇస్తున్నారు. విజయనగరం జిల్లాలోని రెండు డిపోల పరిధిలో ఆరు డీజీటీ వాహనాలు ఈ సేవలను అందిస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 500 బుకింగ్‌లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా రోజుకు రూ.1.48 లక్షల ఆదాయం వస్తోంది. ప్రారంభంలో తక్కువ ఆదాయం ఉన్నా, ఇప్పుడు మంచి లాభాలు వస్తున్నాయన్నారు.
ఆర్టీసీ ఇప్పుడు గుండు సూది నుండి 12 టన్నుల బరువు వరకు సరుకు రవాణా చేస్తోంది. కిలోమీటరుకు 25 కిలోల వరకు బరువుకు రూ.5 మాత్రమే తీసుకుంటున్నారు. ప్రైవేటు కార్గో సర్వీసులతో పోలిస్తే ఇది చాలా తక్కువ. బల్క్ బుకింగ్స్‌పై, నెలవారీ బుకింగ్‌లపై రాయితీలు ఇస్తున్నారు. దీని ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించాలని చూస్తున్నారు. త్వరలోనే డోర్ టూ డోర్ సర్వీసును కూడా ప్రారంభిస్తారు. ఈ-కామర్స్ సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆర్టీసీ ఎదురుచూస్తోంది. కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త ప్రణాళికలు వేస్తున్నారు. ప్రైవేట్ కార్గో సర్వీసులతో పోలిస్తే ఆర్టీసీ ఛార్జీలు మూడు రెట్లు తక్కువగా ఉన్నాయి. త్వరలోనే డోర్ టూ డోర్ సర్వీసును ప్రారంభిస్తామని, ఈ-కామర్స్ సంస్థల సహకారం కోరుతున్నామని తెలిపారు.