Kitchen Hacks: చేపలు వండేటప్పుడు వాసన వస్తోందా..? ఈసారి ఇలా చేసి చూడండి..!

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని మనకు తెలుసు. కానీ వాటిని వండేటప్పుడు వచ్చే ఘాటు వాసన వంటింట్లో కాదు.. ఇంటి అంతటినీ నింపేస్తుంది. ఈ వాసన వల్ల కొంత మందికి చిరాకు వస్తుంది. వాంతులు వచ్చినట్లు అనిపించవచ్చు. దీంతో చేపలను ఇంట్లో వండాలని అనుకున్నా.. ఆ వాసన వల్ల వెనకడుగు వేయాల్సి వస్తుంది.
అయితే వాసనను తగ్గించే కొన్ని పద్ధతులు మన ఇంట్లోనే ఉన్నాయి. ఈ పద్ధతులు వంటింట్లో సహజంగా వాడే పదార్థాలతో సులభంగా పాటించవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. వంట మొదలుపెట్టే ముందు చేపలపై పసుపు, ఉప్పు కలిపి రాయండి. 30 నిమిషాలు ఉంచితే వాటి వాసన చాలా వరకు తగ్గుతుంది. ఈ రెండు పదార్థాలు క్రిమినాశకాలు. చేపలపై ఉండే మాలిన్యాలు, వాసనకు కారణమయ్యే సూక్ష్మజీవులను తొలగించడంలో సహాయపడతాయి.
శనగపిండితో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్ ను చేపలపై రాసి కొద్దిసేపు ఉంచిన తర్వాత కడిగితే వాసన దాదాపు పోతుంది. ఇది ఉప్పునీటి చేపలకైనా, మంచి నీటి చేపలకైనా పనిచేస్తుంది.
తాజాగా నూరిన అల్లం వెల్లుల్లి ముద్దను చేపలపై రాసి 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచితే వాటి సహజమైన వాసన వల్ల చేపల్లో దుర్వాసన తగ్గుతుంది. ఇది రుచి పెంచడంలోనే కాదు.. బ్యాక్టీరియాను నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది.
ఈ ఇంటి చిట్కాలు చాలా సులభంగా పాటించగలవి. దీని ద్వారా మీరు చేపలను ఇంట్లోనే సురక్షితంగా, దుర్వాసన లేకుండా వండవచ్చు. ఇకపై వాసన కోసం చేపల వంటకు భయపడాల్సిన పనిలేదు. ఇవి పాటించి మీ వంటకాన్ని ఆనందంగా ఆస్వాదించండి.