యుద్ధంలో పాల్గొంటా.. వారంలో పాక్ పని ఖతం.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
16 ఏళ్లకే తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పని చేసిన తాను.. అవసరం అయితే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధం అన్నారు. మన సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ పని వారం రోజుల్లో ఖతం అవుతుందన్నారు. పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చేసే సత్తా మనకు ఉందన్నారు.
దేశానికి అవసరం ఐతే నేను కూడా యుద్ధంలో పాల్గొంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ రోజు గాంధీభవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. 16 ఏళ్లకే తాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మిగ్ 21 ఫ్లైట్ కు పైలట్ గా పని చేసినట్లు చెప్పారు. 1982లో మిగ్ యుద్ధ విమానాన్ని నడిపారు. ఉత్తర్ లే, అవంతి, శ్రీనగర్, అమృత్ ఏరియాల్లో చాలా సంవత్సరాలు పని చేశానన్నారు. చాలా చిన్న వయసులో నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. 22న జరిగిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రదాడి హేమనీయమైనదన్నారు. మతం అడిగి చంపడం దారుణమన్నారు. ఈ ఘటన పై కశ్మీర్ తో పాటు దేశం మొత్తం ఏకతాటి పై వచ్చిందన్నారు.
TRF సంస్థకు పాకిస్తాన్ మద్దతు పలికిందన్నారు. ఆపరేషన్ సింధూర్ లో రఫెల్ యుద్ధ విమానాలు, డ్రోన్స్ ఉపయోగించారన్నారు. రఫెల్ యుద్ద విమానాలు కూల్చం అని పాకిస్తాన్ అబద్ధం చెబుతోందన్నారు. రఫెల్ యుద్ద విమానాలు బార్డర్ దాటలేదన్నారు. పాకిస్తాన్ లో పేరుకే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది కానీ అక్కడ ఆర్మీ చీఫ్ అంతా నడిపిస్తాడన్నారు. ఇండియా, పాకిస్తాన్ కు ఒకటే సారి స్వతంత్రం వచ్చిందన్నారు.
పాక్ ప్రపంచ పటంలో ఉండదు..
భారత్ ప్రపంచం దేశాలతో పోటీలో ముందు ఉంటే… పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఇబ్బందులు పడుతోందన్నారు. భారత త్రివిధ దళాలకు హాట్స్ ఆఫ్ అన్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ ప్రపంచపటంలో లేకుండా పోవడం ఖాయమన్నారు. ఆ సత్తా భారత్ వద్ద ఉందన్నారు. మూడో దేశం ఏది కూడా ప్రత్యక్ష యుద్ధానికి రాదన్నారు. పీఓకేను భారత్ అధీనంలోకి తీసుకోవాలన్నారు. మన సైన్యం తలుచుకుంటే పాకిస్తాన్ పని వారం రోజుల్లో ఖతం అవుతుందన్నారు.