Sugar Cane Juice | చెరుకు రసాన్ని తరచూ తాగితే ఇన్ని లాభాలు ఉన్నాయా.. తరచూ తీసుకోవాల్సిందే..!

వేసవి కాలంలో సహజంగానే చాలా మంది చల్లని మార్గాలను ఆశ్రయిస్తుంటారు. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు, చల్లని నీళ్లతోపాటు చెరుకు రసం కూడా ఎక్కువగానే తాగుతారు.
వేసవి కాలంలో సహజంగానే చాలా మంది చల్లని మార్గాలను ఆశ్రయిస్తుంటారు. వేసవి తాపం నుంచి తట్టుకునేందుకు కొబ్బరి బొండాలు, శీతల పానీయాలు, చల్లని నీళ్లతోపాటు చెరుకు రసం కూడా ఎక్కువగానే తాగుతారు. చెరుకు రసాన్ని ఈ సీజన్‌లో సేవిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. మండే ఎండల నుంచి ఉపశమనాన్ని అందించడంలో చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో శరీరానికి చలువ చేసే గుణాలు ఉంటాయి. అందువల్ల చెరుకు రసాన్ని సేవిస్తే శరీరం చల్లగా మారుతుంది. వేడి తగ్గిపోతుంది. వేసవి తాపం తగ్గుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. 250 ఎంఎల్ చెరుకు రసాన్ని సేవిస్తే మనకు సుమారుగా 160 క్యాలరీల శక్తి లభిస్తుంది. అలాగే ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ ఇ ఇందులో సమృద్ధిగా ఉంటాయి.
శక్తికి, ఉత్సాహానికి..
వేసవి కాలంలో సహజంగానే మనకు నీరసం అధికంగా వస్తుంది. చిన్న పనిచేసినా చాలు త్వరగా అలసిపోతుంటారు. అలాగే ఉదయం లేవగానే నిస్సత్తువగా కూడా ఉంటుంది. ఏ పని చేయాలనిపించదు. బద్దకంగా ఉంటుంది. ఈ లక్షణాల నుంచి బయట పడాలంటే అందుకు చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. ఈ రసాన్ని సేవిస్తే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. ఎంత పని చేసినా అలసట రాదు. చెరుకు రసంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. చెరుకు రసం తాగితే మలబద్దకం తగ్గుతుంది. పేగుల్లో మలం కదలికలు సరిగ్గా ఉంటాయి. శరీరంలో పీహెచ్ స్థాయిలు సక్రమంగా నిర్వహించబడతాయి. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి.
కొలెస్ట్రాల్ తగ్గేందుకు..
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం చెరుకు రసాన్ని తరచూ సేవిస్తుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి చెరుకు రసం ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తాగితే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువును తగ్గించేందుకు సహాయం చేస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ చెరుకు రసం అద్భుతంగా పనిచేస్తుంది. చెరుకు రసాన్ని సేవిస్తుంటే కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటకు పోతాయి. కిడ్నీలు క్లీన్ అవుతాయి. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రంలో మంట తగ్గిపోతుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
చర్మ సంరక్షణకు..
చెరుకు రసంలో ఫ్లేవనాయిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే ఈ రసంలో ఫినోలిక్ సమ్మేళనాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలు వయస్సు మీద పడడం ఆలస్యం అవుతుంది. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖంపై ఉండే ముడతలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం సహజసిద్ధమైన నిగారింపును పొందుతుంది. గర్భంతో ఉన్న మహిళలు చెరుకు రసం సేవిస్తే ఎంతో మేలు జరుగుతుంది. చెరుకు రసంలో ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది గర్భంలోని పిండం ఎదుగుదలకు సహాయం చేస్తుంది. శిశువుకు పుట్టుక లోపాలు రాకుండా చూస్తుంది. ఇలా చెరుకు రసాన్ని తాగడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి.