ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు .
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ‘శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. చెట్ల క్రింద నిలబడద్దొని అధికారులు పేర్కొన్నారు.
గురువారం మూడు గంటలు నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, తిరుపతి, ఎన్టీఆర్, అల్లూరి జిల్లాల్లో వర్షంతో పాటుగా పిడుగులు పడ్డాయి. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అధికారులు సూచించారు. గురువారం సాయంత్రం 6 గంటల నాటికి కృష్ణా జిల్లా పెదఅవుటపల్లిలో 68.9మిమీ, ప్రకాశం జిల్లా సానికవరంలో 65.2 మిమీ, ఎర్రగొండపాలెంలో 62 మిమీ అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. 18 ప్రాంతాల్లో 20మిమీ కంటే ఎక్కువ వర్షపాతం రికార్డైంది’ అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు
తెలంగాణలో కూడా భారీ వర్షం పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో ప్రారంభమై ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం పడింది. ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి నగర జీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్రంలో మరో మూడు రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అంచనా తెలిపింది. ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని.. 7, 8 తేదీల్లో పొడి వాతావరణం ఉంటుందని.. ఆ తరువాత మళ్లీ తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.