BIG BREAKING: ఆ ముగ్గురు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పని తీరు ఆధారంగా ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లో కొండా సురేఖతో పాటు జూపల్లి కృష్ణారావు ఉన్నట్లు తెలుస్తోంది. మూడో మంత్రి ఎవరు అన్న అంశంపై చర్చ సాగుతోంది.
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ముగ్గురు మంత్రులను కేబినెట్ నుంచి తప్పించాలని ఆయన డిసైడ్ అయినట్లు చర్చ సాగుతోంది. శాఖపై పట్టు సాధించకపోవడంతో పాటు జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉండని వారిపై వేటు వేస్తారన్న ప్రచారం సాగుతోంది. కొందరు మంత్రులు అనవసర విషయాల్లో జోక్యం చేసుకుంటూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారని సీఎం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పలుమార్లు హెచ్చరించినా వారి పనితీరు మారకపోవడంతో వేటు వేయడానికే సీఎం సిద్ధమయ్యారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఈ విషయంపై హైకమాండ్ తో సైతం రేవంత్ చర్చించినట్లు సమాచారం. వేటు పడే మంత్రుల జాబితాలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావు ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మరో మంత్రిని కూడా తప్పించాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. అయితే.. ఆ మంత్రి పేరు మాత్రం ఇంత వరకు బయటకు రావడం లేదు. దీంతో ఆ మంత్రి ఎవరై ఉంటారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కొండా సురేఖ.. నిత్యం వివాదాలే..
మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఆమె పని చేసుకోనివ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మంత్రిగా ఉండి పోలీస్ స్టేషన్ కు వెళ్లి వార్నింగ్ ఇవ్వడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. ఈ విషయమై వార్నింగ్ ఇచ్చినా కూడా సురేఖ తీరులో మార్పు రావడం లేదన్న చర్చ ఉంది. దీంతో మంత్రివర్గం నుంచి ఆమెను తప్పించాలని రేవంత్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
జూపల్లి స్థానంలో శ్రీహరికి ఛాన్స్..?
తన సొంత జిల్లా మహబూబ్ నగర్ కు చెందిన జూపల్లి కృష్ణారావు తీరుపై కూడా సీఎం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆశించిన మేర పని చేయడం లేదని.. ఎమ్మెల్యేలతో కూడా సమన్వయం చేసుకోలేకపోతున్నారని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. జూపల్లిని తప్పించి ఆయన స్థానంలో వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖాయమన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.