Hyderabad: నగరవాసులకు అదిరిపోయే వార్త..కొత్త సంవత్సరంలో బొనాంజా ఆఫర్..క్యాబ్స్, బైక్ రైడ్స్ ఫ్రీ

నూతన సంవత్సర వేడుకలకు నగర వాసులు రెడీ అవుతున్నారు.ఈరోజు రాత్రి క్యాబ్స్, బైక్ రైడ్స్ ఉచితంగా అందించనున్నట్టు ప్రకటించగా..మెట్రో సేవలు కూడా అర్ధరాత్రి దాటేంత వరకు ఉంటాయని టీజీ ఫోర్ వీలర్స్ అసోసియేషన్, మెట్రో ప్రకటించాయి.
New Year: కొత్త సంవత్సరం వేడుకలకు భాగ్యనగరం ఓ రేంజ్ లో రెడీ అవుతుంది.2024కి ఓ రేంజ్ లో వీడ్కోలు చెప్పి.. 2025 సంవ్సరానికి గ్రాండ్‌గా వెల్కం చెప్పేందుకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తమ ప్రణాళికలు రెడీ కూడా చేసుకున్నారు.
పబ్‌లు , డీజే లు, దోస్తుల ఇళ్లలో సిట్టింగులు ఇలా రకరకాల ప్లాన్లు వేసుకున్నారు. అయితే.. డిసెంబర్ 31 అంటేనే మందు, చిందు. మరి తాగటం, ఎంజాయ్ చేయటం వరకు ఒకే కానీ.. ఇళ్లకు వెళ్లేదే వెళ్లటమే పెద్ద సాహసమే అని చెప్పుకోవచ్చు. తాగేసి డ్రైవింగ్ చేద్దామంటే పోలీసులు రోడ్ల మీద తాట తీసేందుకు రెడీగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇలాంటి వారి కోసం తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది.
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో.. డిసెంబర్ 31 రాత్రి నగరవాసులకు ఉచిత రవాణా సదుపాయం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్ రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందించనున్నట్లు ప్రకటించింది.
ఇందుకోసం 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ చెప్పింది. మరోవైపు.. కొత్త సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైళ్లు సేవలను కూడా అధికారులు పొడిగించారు. అర్ధరాత్రి 12.30 వరకు సర్వీసులు నడపనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మంగళవారం అర్ధరాత్రి 12.30 కి చివరి రైలు స్టేషన్ నుంచి బయలుదేరి 1.15 వరకు డెస్టినేషన్ స్టేషన్లు చేరుకుంటాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటనలో తెలియజేశారు.
అయితే.. న్యూఇయర్ వేడుకల సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీలు చేసుకునే అలవాటు ఉండటంతో.. చాలా మంది తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవటమే కాకుండా.. ఇతరులకు కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో.. నగరవ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారని సమాచారం. కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొన్నవారు.. ఇళ్లకు వెళ్లేందుకు క్యాబ్‌లు బుక్ చేసుకోవటమో, లేక మెట్రో సేవలను వినియోగించుకోవటమో.. డ్రైవర్లను అందుబాటులో ఉంచుకోవడమో లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.