ఏపీ రైతులు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.20వేలు.. అన్నదాత సుఖీభవ పథకంపై మరో కీలక ప్రకటన

 ఏపీ రైతులు ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.20వేలు.. అన్నదాత సుఖీభవ పథకంపై మరో కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు అందిస్తామన్నారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు..అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా అర్హులైన రైతులందరికి రూ.20 వేలు అందజేస్తామని.. ఇందులో పీఎం కిసాన్ రూ.6 వేలు.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి ఇస్తామని చెప్పారు. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని.. ఇందుకోసం ఇప్పటికే బడ్జెట్లో రూ.4,500 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పిందొకటి.. చేసింది మరొకటి అన్నారు అచ్చెన్నాయుడు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోలో రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పారని.. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చిన రూ.6వేలు.. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 కలిపి రూ.13,500 మాత్రమే ఇచ్చారన్నారు. తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే రూ.6వేలకు.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.16వేలు కలిపి రూ.20వేలు అందిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ఐదేళ్లు అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయశాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు. రైతులకు పరికరాలు, ఇన్స్యూరెన్స్, భూసార పరీక్షలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. రైతుకు రూ.20వేలతో పాటుగా వ్వయసాయంలో యంత్రీకరణ, భూసార పరీక్షలు, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్స్యూరెన్స్, డ్రోన్ టెక్నాలజీ అమలు వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చామన్నారు.

ఇన్స్యూరెన్స్ విషయంలో.. రైతుల నుంచి కొంత సహకారం తీసుకుని కేంద్ర, రాష్ట్రాలు కలిపి ఇస్తున్నాయన్నారు అచ్చెన్నాయుడు. అన్నదాత సుఖీభవకు సంబంధించి బడ్జెట్‌‌లో నిధులు కేటాయించామని.. ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే అమలు చేసినట్లే అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామన్నారు. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్‌లలో రూ.20వేలు జమ చేస్తామని చెప్పారు.

బడ్జెట్‌లో రూ.4500కోట్లు కేటాయించారు.. నిధులు ఎలా సరిపోతాయని కొందరు ప్రశ్నిస్తున్నారని.. ప్రభుత్వం మిగిలిన నిధుల్ని కూడా కలిపి పథకాన్ని అమలు చేస్తుందన్నారు మంత్రి. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో.. అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు ఏటా రూ.20వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంపై వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *