ఏపీలో మద్యం షాపుల ఆఫర్లు.. లిక్కర్ కొంటే ఇవి ఫ్రీ..
ఏపీలో కొత్త మద్యం పాలసీ వచ్చింది. నూతన బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. షాపులు దక్కించుకోవడానికి వ్యాపారులు లక్షలాది రూపాయలు వెచ్చించారు. అవి రాబట్టుకోవడానికి ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. మందుబాబులను ఆకర్షించడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో వైన్ షాపులను దక్కించుకోవడానికి మద్యం వ్యాపారులు లక్షల్లో వెచ్చించారు. కొన్ని చోట్ల ఎంతో కష్టపడి షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగడం లేదు. దీంతో ఆఫర్లు ప్రకటిస్తూ.. మందుబాబులను ఆకర్షిస్తున్నారు. ఇలాగైన మద్యం అమ్మకాలు పెంచుకోవాలని చూస్తున్నారు. ఆఫర్లు ప్రకటించాక అమ్మకాలు కాస్త పెరిగినట్టు తెలుస్తోంది.
అన్నమయ్య జిల్లా మద్యం దుకాణాల ముందు ఆఫర్ల బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ‘ఈ షాపులో క్వాటర్ కొంటే.. మందు తోపాటు ఓ గుడ్డు, ఓ గ్లాసు, ఓ వాటర్ ప్యాకెట్ ఫ్రీ’ అని బ్యానర్లు పెట్టారు. లిక్కర్ సేల్స్ పెంచుకోవడానికి వైన్ షాపుల నిర్వాహకులు ఈ ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఈ ఆఫర్ ప్రకటించిన తర్వాత ఆయా షాపుల్లో లిక్కర్ సేల్స్ పెరిగాయని అంటున్నారు.
ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని.. రెండు కంటే ఎక్కువసార్లు కేసులు నమోదైతే.. లైసెన్స్ రద్దు చేస్తామని ఏకంగా సీఎం వార్నింగ్ ఇచ్చారు. దీంతో పెట్టుబడి పోనూ లాభాలు రావాలంటే ఈ తిప్పలు తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఎలాగైనా సేల్స్ పెంచుకొని లాభాలు సాధించాలని ఆరాటపడుతున్నారు.
ఎందుకీ కష్టం..
ఏపీలో చాలాచోట్ల మద్యం షాపులకు బయట నుంచి అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టారు. ఉదాహరణకు.. తక్కువ వడ్డీకి తీసుకొచ్చినా.. లక్షలకు రెండు రూపాయలు ఉంటుంది. తక్కువలో తక్కువ రూ.20 లక్షల వరకు అప్పులు చేసిన షాపులు పెట్టిన వారు ఎందరో ఉన్నారు. ఆ అప్పునకు నెలకు రూ.40 వేలు వడ్డీ అవుతుంది. ఆ వడ్డీ, సిబ్బంది జీతాలు, షాపు నిర్వహణ ఖర్చులు.. అన్నీ కలిపి నెలకు లక్ష రూపాయలకు వరకు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
అవన్నీ పోనూ లాభాలు రావాలంటే అమ్మకాలు భారీగా ఉండాలి. ఏదో ఆశించి టెండర్లు వేశామని..అందుకే లాభాలు రాకపోయిన పర్వాలేదు.. కనీసం పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలని ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నట్టు మద్యం దుకాణాల నిర్వాహకులు చెబుతున్నారు.