తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు
తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు
2024: రథసప్తమి వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు.
సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పర్వదినాన్ని నిర్వహించనుంది టీటీడీ(TTD). ఈ వేడుకకు విచ్చేసే వేలది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులు, పోలీస్ అధికారులతో శుక్రవారం ఈవో సమీక్ష నిర్వహించారు.
అన్నప్రసాదం అధికారులు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసర సేవలందించడానికి వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. రథసప్తమి సందర్భంగా వివిధ రకాల ఫలపుష్పాలతో, పచ్చని తోరణాలతో, అందమైన అరటి చెట్లతో పందిళ్ళను ఏర్పాటు చేసి తిరుమాడ వీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన విభాగం అధికారులను ఈవో ఆదేశించారు.