Miriyala Rasam: మిరియాల రసం వారానికోసారి ఇలా పెట్టుకుని తినండి, ఎంతో మంచిది
Miriyala Rasam: మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో చేసుకొని తినే ఆహారాలలో ముఖ్యమైనది మిరియాల రసం. చలికాలంలో మిరియాల రసాన్ని అప్పుడప్పుడు తినడం చాలా ముఖ్యం. ఈ మిరియాల రసం రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

మిరియాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
చింతపండు – నిమ్మకాయ సైజంత
టమోటాలు – ఒకటి
పసుపు – పావు స్పూన్
ఎండుమిర్చి – మూడు
ఆవాలు – ఒక స్పూన్
కరివేపాకు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
ఇంగువ పొడి – పావు స్పూను
మిరియాల రసం రెసిపీ
1. మిరియాలను, వెల్లుల్లి, జీలకర్రను మిక్సీలో వేసి బరకగా చేసుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
3. పసుపును కూడా జత చేయాలి.
4. ఇప్పుడు టమాటో ముక్కలను వేసి బాగా కలపాలి. పైన మూత పెడితే అవి మెత్తగా మగ్గుతాయి.
5. ఉప్పును కూడా వేస్తే టమాటా ముక్కలు త్వరగా మెత్తగా అవుతాయి.
6. ఇప్పుడు టమోటో గుజ్జులో చింతపండు పులుసును, దంచుకున్న మిరియాల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
7. కరివేపాకులు, కొత్తిమీర తరుగు, ఇంగువ పొడి కూడా వేసి బాగా కలిపి అర గ్లాసు నీళ్లను పోయాలి.
8. చిన్నమంట మీద ఉడికించాలి. పావుగంట ఉడికిస్తే ఇది ఘుమఘుమలాడుతుంది. అంతే మిరియాల రసం రెడీ అయినట్టే.
చలికాలంలో మిరియాలు తినడం చాలా ముఖ్యం. మిరియాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మిరియాలకు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం ఉంది. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే నరాల సమస్యలను అదుపులో ఉంచుతుంది. వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు మిరియాల రసాన్ని చేసుకుని తాగడం అలవాటు చేసుకోవాలి.