ఉ** ఆగడం లేదని ఒకరు, చెప్పుతో కొడతామని ఒకరు.. సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు’
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగితే.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీల గురించి అడిగితే.. సహనం కోల్పోయి రకరకాలుగా మాట్లాడుతున్నారని.. వీటన్నింటికీ ప్రజలే గుణపాఠం చెప్తారని హరీశ్ రావు తెలిపారు. ఎన్నికల కోడ్ వచ్చే ముందే హామీలన్ని అమలు చేసి తీరాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
తాము కేవలం హామీలు అమలు చేయాలని కోరుతున్నామని హరీశ్ రావు అన్నారు. మార్చి 17వ తేదీకి వంద రోజులు నిండుతుందని.. అంతలోపు ఎన్నికల కోడ్ వస్తుందన్నారు. మహిళా విషయంలో ఒకే హామీ అమలు చేసి అన్ని అమలు చేశామంటే ఎలా అని ప్రశ్నించారు. ఇక.. నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని.. ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఇప్పటికైనా వివరణ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అడిగారు. ఎన్నికల కోడ్‌కు ముందే హామీలు అమలు చేయకపోతే.. దాటవేసినట్లేనని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ఎర్రవెల్లిలో జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై సుదీర్ఘ చర్చ జరిగిందని తెలిపారు. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం సరికాదని.. దాని వల్ల తెలంగాణాకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను కృష్ణ రివర్ బోర్డుకు అప్పగిస్తూ సంతకాలు పెట్టిందని.. కేంద్రం దీనికి సంబంధించిన మినట్స్ కూడా బయట పెట్టిందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేలకుండా బోర్డుకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు ప్రాజెక్టుపైకి తెలంగాణ అధికారులు అడుగుపెట్టే అవకాశం లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయ్యిందన్నారు హరీశ్ రావు.