Medaram Jatara: మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్లాస్టిక్‌ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది.

మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు

మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు

Medaram Jatara: లక్షలాది మంది భక్తులతో జనసంద్రమయ్యే జాతర మేడారం. ఫిబ్రవరి 21 నుంచి మొదలుకానున్న ఈ మహాజాతరకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. జాతర జరిగే నాలుగు రోజులపాటు మేడారం కుగ్రామం కాస్త మహానగరాన్ని తలపిస్తుంటుంది.

ఇంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చే జాతరలో ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. దీంతో జాతర జరిగే రోజుల్లో టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతుంటాయి. ఆ తరువాత ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుండగా.. ఈసారి ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది.

పక్కా కార్యచరణతో ప్లాస్టిక్ ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పుడిప్పుడే ప్లాస్టిక్ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఇంత తక్కువ సమయంలో జనాలకు ఎంతమేర చేరగలుగుతుందోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు రోజుల్లోనే టన్నుల కొద్దీ వ్యర్థాలు

ఉమ్మడి వరంగల్ లోని ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు తెలంగాణ కుంభమేళా మేడారం జాతర జరగనుంది. ఈ నాలుగు రోజుల జాతరకు తక్కువలో తక్కువ కోటిన్నర మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

మేడారం చుట్టుపక్కల దాదాపు 25 కిలోమీటర్ల వరకు జనమే కనిపిస్తుంటారు. కాగా ఇక్కడికి వచ్చే భక్తులు వివిధ అవసరాల నిమిత్తం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో పాటు ఇతర ప్లాస్టిక్ కవర్లు తీసుకొస్తుంటారు. తమ అవసరాల తీరిన తరువాత వాటిని జాతర ప్రదేశంలోనే వదిలేస్తుంటారు.

ప్రభుత్వం తరఫున అక్కడక్కడ చెత్త కుండీలు, డ్రమ్ములు ఏర్పాటు చేస్తున్నా.. జనాలు వాటిని పట్టించుకోకుండా ప్లాస్టిక్ కవర్లను ఎక్కడిపడితే అక్కడ వదిలేసి పోతుంటారు. దీంతో జాతర జరిగే నాలుగు రోజుల్లోనే దాదాపు 2 వేల టన్నుల వరకు చెత్త పోగవుతుండగా.. అందులో సగం వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి.

దీంతో చేసేదేమీ లేక అక్కడి అధికారులు ప్లాస్టిక్ వ్యర్థాలను కాలబెట్టడమో.. భూమిలో పూడ్చిపెట్టడమో చేస్తున్నారు. ఫలితంగా కాలుష్యానికి అడ్డుకట్ట పడలేకపోతోంది.

సవాలుగా తీసుకున్న ప్రభుత్వం

కొన్నేళ్లుగా మేడారం జాతర సందర్భంగా ‘ప్లాస్టిక్ ఫ్రీ’ అంశం తెరమీదకు వస్తుండగా.. ఈసారి నిషేధాన్ని పక్కాగా అమలు చేయడాన్ని ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఇప్పటికే జిల్లా అధికారులకు ప్లాస్టిక్ నిషేధానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.

దీంతో జిల్లా అధికార యంత్రాంగం ప్లాస్టిక్ నియంత్రణ చర్యలకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మేడారం గ్రామస్థులు, గ్రామానికి చెందిన వ్యాపారులకు ప్లాస్టిక్ కవర్లు విక్రయించవద్దని నోటీసులు జారీ చేశారు.

ప్లాస్టిక్ వల్ల ప్రమాదం ఏర్పడుతోందని, దాని నియంత్రణ ఆవశ్యకతను వివరిస్తూ స్థానికంగా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రోత్సహిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

ప్రత్యామ్నయం చూపిస్తేనే మేలు

ప్లాస్టిక్ నియంత్రణపై ఫోకస్ పెట్టిన అధికారులు వ్యాపారులకు ప్రత్యామ్నయం చూపడం పై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. జ్యూట్ బ్యాగుల వినియోగాన్ని పెంచడంతో పాటు జాతరలో క్లాత్ బ్యాగులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఈసారి జాతరలో ప్లాస్టిక్ నియంత్రణ సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జాతరలో మేడారానికి చెందిన వ్యాపారులే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అక్కడ పలురకాలు వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. వాళ్లంతా విచ్చలవిడిగా ప్లాస్టిక్ ను వినియోగిస్తూనే ఉంటారు. దీంతోనే ముందుగా వ్యాపారులకు ప్లాస్టిక్ రహిత సంచులు అందుబాటులో ఉంచాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

ప్లాస్టిక్ నియంత్రణపై ఇప్పుడిప్పుడే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. జాతరలో ప్లాస్టిక్ నిషేధం సంపూర్ణంగా అమలు చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *