Praja Palana Application Form : ‘ప్రజా పాలన’ దరఖాస్తులు – కావాల్సిన పత్రాలు ఇవే
- Praja Palana Application Form Updates : తెలంగాణ వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా… కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఇందుకోసం కావాల్సిన పత్రాలతో పాటు వివరాలను తెలుసుకోండి…

ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా… ఆరు పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, యువ వికాసం పథకాలున్నాయి.

ప్రతి పథకానికి వేర్వేరుగా దరఖాస్తు చేసుకోనవసరం లేకుండా.. ఏ పథకానికి అర్హులైనవారు ఆ పథకానికి అవసరమైన వివరాలు మాత్రమే దరఖాస్తు ఫారంలో నింపాల్సి ఉంటుంది. ఒకే ఫారమ్ లో అన్ని పథకాలకు సంబంధించిన కాలమ్స్ ఇచ్చారు.

దరఖాస్తు ఫారమ్ తో పాటు రేషన్‌కార్డు జత చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా… ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, దరఖాస్తుదారు ఫొటో అతికించాలి.

మెుత్తం 4 పేజీల దరఖాస్తు ఫారం ఉంటుంది. తొలి పేజీలో కుటుంబ యజమాని పేరు, పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య, రేషన్‌కార్డు సంఖ్య, మొబైల్ ఫోన్ నంబరు, వృత్తితో పాటు సామాజికవర్గం వివరాలను నింపాలి.

ఆ తర్వాత సామాజికవర్గ వివరాలతో పాటు కుటుంబసభ్యుల పేర్లు, వారి పుట్టిన తేదీలు, వారి ఆధార్ నంబర్లు రాయాలి. తర్వాత దరఖాస్తుదారు చిరునామా నింపాలి. కుటుంబ వివరాల తర్వాత పథకాలకు సంబంధించిన వివరాలున్నాయి. ఏ పథకానికి దరఖాస్తు చేయాలని అనుకుంటే ఆ పథకం దగ్గర టిక్ మార్కు చేయాలి.