న్యూఇయర్ వేళ మందుబాబుల రికార్డ్.. 3 రోజుల్లోనే సలార్ కలెక్షన్స్ బ్రేక్..!
నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబులు తగ్గేదేలే అంటూ తెగ తాగేశారు. కేవలం మూడు రోజుల్లోనే.. ఏకంగా సలార్ మూవీ కలక్షన్లను దాటేశారంటే.. మామూలు విషయం కాదు. 29 రాత్రి నుంచే వైన్సుల వద్ద జాతర మొదలవగా.. 31 రాత్రి 12 గంటల వరకు కొనసాగింది. దీంతో.. ఈ మూడు రోజుల్లోనే.. రూ. 658 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు అబ్కారీ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఈ నెల 29, 30, 31 మూడు రోజుల్లోనే ఏకంగా రూ.658 కోట్ల మేర మద్యం, బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. వీకెండ్ కావటం.. అందులోనూ డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులను తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్టు చెప్తున్నారు. మూడు రోజుల్లో 4.76 లక్షల కేసుల మద్యం, 6.31 లక్షల కేసుల బీర్లు విక్రయించినట్లు సమాచారం. ముందుగానే ఈవెంట్లు ప్లాన్ చేసుకోవటంతో.. లిక్కర్ గోదాంల నుంచి ముందుగానే మద్యం తరలించారు. దీంతో.. 30వ తేదీనే రూ.313 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు సమాచారం. డిసెంబర్ 31న భారీ సేల్స్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
మద్యంతో పాటు కూల్ డ్రింక్స్ కూడా భారీగా అమ్ముడయ్యాయి. వాటితో పాటు చికెన్, మటన్, చేపలు కూడా పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో నాన్ వెజ్ విక్రయాలు జోరందుకున్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 3 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరగగా.. ఆదివారం ఒక్కరోజే 4.5 లక్షల కిలోల చికెన్ విక్రయాలు జరిగినట్టు సమాచారం.