Praja Palana : పార్టీలోకి వస్తేనే ఇల్లు, పెన్షన్ ఇస్తామనే విధానం మా ప్రభుత్వంలో ఉండదు – డిప్యూటీ సీఎం భట్టి
Deputy CM Bhatti On Praja Palana:ప్రజా పాలన కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ప్రభుత్వంలో బెదిరింపులు ఉండవని… ప్రజలకే ఈ ప్రభుత్వం అంకితమన్నారు.
Deputy CM Bhatti Vikramarka: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ ఊరిలో కౌంటర్ ఉంటుందని… ఆరో తేదీ వరకు ధరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. అందరికి ఒకటే మాట.. ఈ ప్రభుత్వం అందరిదీ అని వ్యాఖ్యానించారు. ఈ సర్కార్ ఏ ఒక్కరికోది.. ఒక వర్గందో కాదన్నారు.
గత పాలకుల లెక్క మా పార్టీలోకి వస్తేనే ఇల్లు.. పెన్షన్ ఇస్తాం అనేది ఉండదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ప్రభుత్వంలో… బెదిరింపులు ఉండవని… ప్రజలకే ఈ ప్రభుత్వం అంకితమన్నారు. ప్రజా పాలన కోసం ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందన్నారు. ఈ విజయం ప్రజలకే అంకితమన్న భట్టి…. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఉచిత బస్సు అమలు చేశామని… రూ. 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ ని పెంచామని గుర్తు చేశారు. ఇళ్లు లేనివాళ్లకు, పెన్షన్లేని వాళ్లకు, గృహజ్యోతి కింద రావాల్సిన విద్యుత్ అన్ని అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని… మాలాగే ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండు అని బీఆర్ఎస్ చూస్తుందని కామెంట్స్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో ప్రజా పాలన కార్యక్రమం మొదలైంది. మొత్తం 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు నడుస్తున్నాయి.ఇందుకోసం 3,714 అధికార బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి వంద మంది దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా షామియానా, బారికేడ్లు, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలను కూడా కల్పించారు.మరోవైపు పలుచోట్ల ఈ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది.