ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

 ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

మార్కాపురం వన్‌టౌన్‌, డిసెంబరు 25: క్రిస్మస్‌ పర్వదినాన్ని సోమవారం మార్కాపురంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. ఏబీఎం టౌన్‌ చర్చ్‌, నగర్‌ చర్చ్‌, పాలెం చర్చ్‌, ఆర్‌సీఎం చర్చ్‌లతో పాటు వివిధ చర్చీలలో సంఘ కాపరులు సందేశమిచ్చారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమన్నారు.

త్రిపురాంతకం : మండలంలోని అన్నిగ్రామాల్లో క్రిస్మస్‌ పర్వదినాన్ని క్రైస్తవులు సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా పండుగను పురస్కరించుకొని ఆదివారం రాత్రి నుండే అన్ని చర్చీలను విద్యుత్‌ దీపాలతో అలంకరించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. త్రిపురాంతకంలోని లూథరన్‌, ఆర్‌సీఎం, హెబ్రోను, బిలీవర్స్‌, తెలుగు బాప్టిస్టు, బేతేలుచర్చి, కర్మేలు, హోసన్నా చర్చిలలో ప్రత్యేక ప్రార్ధలను చేశారు. ఈ సందర్బంగా పాస్టర్లు క్రీస్తు సందేశాలను వినిపించి, పాటలు పాడారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

పొదిలి : పొదిలిలోని బాప్టిస్టు చర్చీ, కవెనెంట్‌, గుడ్‌షెపెర్డ్‌ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఆయా చర్చీలలో క్రీస్తు సందేశాన్ని ఫాస్టర్లు భక్తులకు వివరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రిస్మస్‌ పండుగ సందర్భంగా పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి మండలాల ఫోటోగ్రాఫర్స్‌, వీడియో గ్రాఫర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వివిధ చర్చిల వద్ద శీతల పానియాలు ఏర్పాటు చేశారు. డి.జాన్‌విక్టర్‌, జి.సురేష్‌కుమార్‌లు తెలుగు బాపిస్టు చర్చిలో క్రీస్తు సందేఽశం వినించారు.

గిద్దలూరు : క్రిస్మస్‌ సందర్భంగా పట్టణంలోని సీఎస్‌ఐ, జీసస్‌హోలి, తెలుగు బాప్టిస్టు, పలు చర్చిలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఆయా చర్చీల ఫాదర్లు క్రీస్తు సందేశం వినిపించారు. ఓబులాపురం గ్రామంలోని క్రైస్తవ ప్రార్థన మందిరంలో 200 మంది వృద్ధులకు, చిన్నారులకు వేమిరెడ్డి రామచంద్రరెడ్డి దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చేరెడ్డి జయరామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజశేఖర్‌, నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌ జపొట్టిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా క్రిస్మస్‌ పర్వదినం

కంభం : కంభం, అర్థవీడు మండలాల్లో క్రైస్తవులు సోమవారం క్రిస్మస్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకు న్నారు. మండలంలోని అన్ని చర్చిలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

రాచర్ల : మండలంలోని రాచర్ల, అనుమలవీడు, ఆక వీడు, చినగానిపల్లి, జే.పీ.చెరువు, చోళ్లవీడు గ్రామాల్లోని ప్రముఖ చర్చిలలో క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు జరిగాయి. ఆయా సంఘ కాపరులు క్రీస్తు సందేశం వినిపించారు. స్పందన ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకల్లో పేర్ల సుధీర్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

పెద్దదోర్నాల : మండలంలోని క్రైస్తవులు క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని భక్తులు అత్యంత విశ్వాసంతో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చర్చిలను విద్యుత్‌ కాంతులతో శోభాయమానంగా అలంకరించారు. క్రీస్తు చూపిన, ప్రేమ, కరుణ, దయ వంటి మార్గాలను వివరించారు. క్రైస్ట్‌ చర్చిలో బీ అగస్టీన్‌ సహకారంతో వైద్యశాల సూపరిండెంట్‌ భాస్కర్‌కుమార్‌ 40 మందిపేదలకు చీరలు పంపిణీచేశారు. పర్వదినాన్ని పురష్కరించుకుని హిందువులు, ముస్లింలు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.

నారాయణరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు

తర్లుపాడు : క్రిస్మస్‌ పర్వదినాన్ని మండలంలోని అన్ని చర్చీలలో ఘనంగా నిర్వహించారు. మండలంలోని నాగెళ్లముడుపు, కేతగుడిపి, బుడ్డపల్లి, తర్లుపాడు చర్చీలలో క్రైస్తవులతో పాటు ప్రార్థనలు చేశారు. ఆయా ప్రార్థనల్లో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. పాస్టర్లు ఆయనకి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ ప్రతినిధులు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు.

ఎర్రగొండపాలెం : క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా, పట్టణంలోని హోసన్నా మందిరంలో పాస్టరు రెవ మోషే క్రీస్తు సందేశం వినిపించారు. యేసు కృప అందరికీ ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మండలంలోని అన్ని చర్చీలలో యేసు కీర్తనలను దైవజనులు ఆలపించారు. ఇశ్రాయేలు పేట తెలుగుబాప్టిస్టు చర్చీలో పాస్టరు టి రమేష్‌, అంబేడ్కర్‌ నగర్‌లో ఆంధ్ర ఇవాంజికల్‌ లూధరన్‌ చర్చీలో, అమానిగుడిపాడు చర్చీలో పాస్టరు ఆశీర్వాదం, కొలుకుల, ఎల్లారెడ్డిపల్లి, వీరభద్రాపురం, గుర్రపుసాల చర్చీలలో క్రైస్థవులు ప్రత్యేక పార్ధనలు చేశారు.

స్థానిక ఇశ్రాయల్‌పేట తెలుగుబాప్టిస్టు చర్చీలో సీనియర్‌ సువార్త గాయకులు చేదూరి లక్ష్మయ్యను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చర్చీ పాస్టరు టి రమేష్‌, జడ్పీటీసీ చేదూరి విజయబాస్కర్‌, ఏఎంసీ ఉపాధ్యక్షులు కొర్రపోలు జయరావు, నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షులు సన్నెపోగు సుందరరాజు, డైరక్టరు చేదూరి కన్నా, సంఘపెద్దలు పాల్గొని సన్మానించి కొత్త దుస్తులు బహుకరించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *