Chandrababu : వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం, వైసీపీకి ఓటమి ఖాయం- చంద్రబాబు

 Chandrababu : వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం, వైసీపీకి ఓటమి ఖాయం- చంద్రబాబు

Chandrababu : సీఎం జగన్ పాలనలో పాదయాత్రలపై దండయాత్రలు చూశామని చంద్రబాబు అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టారని, వాటికి వడ్డీతో సహా చెల్లిస్తా్మన్నారు.

Chandrababu : టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లాలో యువగళం విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. తిరుపతి, అమరావతిలో కూడా సభలు నిర్వహిస్తామని తెలిపారు. ఏడాదికి ఉచితంగా మూడు సిలిండర్లు, ఆడబిడ్డకు నెలకు రూ.1500 , తల్లికి వందనం పథకం ద్వారా రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు పెట్టుబడి సాయం చేస్తామన్నారు.

వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం

దేశంలో పాదయాత్రలు కొత్త కాదన్న చంద్రబాబు….పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు మాత్రం లేవన్నారు. కానీ సీఎం జగన్ పాలనలో పాదయాత్రలపై దండయాత్రలు చూశామన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఇబ్బందులు సృష్టించారని, వాటికి వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం యువతకు అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను తరిమికొట్టారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మాకు రాజకీయ వ్యతిరేకత తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదని చంద్రబాబు అన్నారు. వైసీపీ నేతల కబ్జాలతో ఉత్తరాంధ్ర పూర్తిగా నలిగిపోతోందన్నారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి పోయి, కబ్జాలు పెరిగాయన్నారు. వైసీపీ నేతలు మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారని ఆరోపించారు.

రూ.3 వేల నిరుద్యోగ భృతి

గతంలో విశాఖ ఆర్థిక రాజధానిగా ఉండేదని, ఇప్పుడు గంజాయికి క్యాపిటల్ గా మారిందని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో విధ్వంస పాలనకు జగన్‌ నాంది పలికారన్నారు. రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడారన్నారు. రుషికొండను బోడిగుండు కొట్టేశారన్నారు. సీఎం విల్లా కోసం రూ.500 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. అమరావతి లేదా తిరుపతి సభలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తామన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వంలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తామని హామీ ఇచ్చారు. బీసీల కోసం రక్షణ చట్టం తీసుకువస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయమంటూ చంద్రబాబు అన్నారు.

జగన్ రాజకీయాలకు అనర్హుడు

నారా లోకేశ్ 226 రోజుల పాటు రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల సమస్యల్ని అధ్యయనం చేశారని చంద్రబాబు అన్నారు. మహిళలకు రక్షణ ఉండాలంటే ఏపీని వైసీపీ విముక్త రాష్ట్రంగా మార్చాలన్నారు. వైసీపీ రాజకీయ పార్టీకాదని, జగన్‌ రాజకీయాలకు అనర్హుడన్నారు. వైసీపీ ఒక్క ఓటు వేసినా రాష్ట్రానికి శాపంగా మారుతుందన్నారు. జగన్‌ చేసిన తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. టీడీపీ, జనసేనకు మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా జరగని ఘటనలు ఏపీలో జరుగుతున్నాయన్నారు. ఉద్యోగులకు న్యాయం చేసే బాధ్యత టీడీపీ, జనసేన తీసుకున్నాయని చంద్రబాబు అన్నారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *