Warangal Leaders: చైర్మన్ పదవులు కోల్పోయిన ఓరుగల్లు బిఆర్‌ఎస్ నాయకులు
Warangal Leaders: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇంటికి పంపించేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ తాజాగా రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. దీంతో ఓరుగల్లు జిల్లాకు చెందిన ఏడుగురు నాయకులు పదవులు కోల్పోయారు.
Warangal Leaders: పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనుకుంటే సీన్ రివర్స్ కావడం, పదవీకాలం ముగియకముందే పోస్టు ఊడిపోవడంతో వారంతా దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఏం చేయాలో తోచక అయోమయం చెందుతున్నారు.
టికెట్ దక్కకపోయినా పదవి ఉంటదనుకుంటే..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు సిట్టుంగులందరికీ టికెట్లు ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. స్టేషన్ ఘన్ పూర్, జనగామ అభ్యర్థులను మార్చారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే గా ఉన్న డా.తాటికొండ రాజయ్య టికెట్ ను కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానాన్నీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చారు. దీంతో వాళ్లిద్దరూ నిరాశలో పడటంతో ముత్తిరెడ్డి కి టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా, రాజయ్యకు రైతుబంధు సమితి చైర్మన్ గా పదవులు కట్టబెట్టారు.
ఎమ్మెల్యే పదవి పోయినా కనీసం ఆయా కార్పొరేషన్ పదవులతోనైనా సరిపెట్టకుందామనుకున్న ఇద్దరికీ నిరాశే మిగిలింది. రెండు నెలల కిందటే వారిద్దరు చైర్మన్ లుగా బాధ్యతలు స్వీకరించగా.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఇద్దరి పదవి కాలం అర్ధాంతరంగా ముగిసింది. అటు ఎమ్మెల్యే టికెట్ రాక.. ఇటు వచ్చిన చైర్మన్ పదవి మధ్యలోనే ఊడిపోవడంతో ఇద్దరూ ఏం చేయాలో అర్థంకాక గందరగోళంలో పడ్డారు.
ఎమ్మెల్యే దక్కలే.. పదవీ నిలువలే
హనుమకొండ జిల్లా పరకాల ప్రాంతానికి చెందిన ఉద్యమకారుడు నాగుర్ల వెంకటేశ్వర్లు 2018 లో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం 2021లో ముగియడంతో మరోసారి అప్పటి ప్రభుత్వం రెన్యూవల్ చేసింది. కాగా స్వతహాగా ఉద్యమకారుడు కావడం, జనాల్లోనూ మంచి పేరు ఉండటం ఎప్పటి నుంచో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ వచ్చారు. కానీ కేసీఆర్, కేటీఆర్ కు దగ్గరి వ్యక్తి అనే పేరున్నా ఆ అవకాశం మాత్రం దక్కలేదు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరకాల టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఆ కల నెరవేరకపోగా ఇప్పుడు ఉన్న పదవి కాస్త దూరం కావడంతో నాగుర్ల అయోమయంలో పడ్డారు.
ఉద్యమం నుంచి కీలకంగా..
కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాడు. దీంతోనే స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017 లో తెలంగాణ స్టేట్ వికలాంగుల కో ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. అంగ వైకల్యం ఉన్నా ఉద్యమంలో పోరాడాడనే ఉద్దేశంతో ఆయన పదవీ కాలాన్ని మూడు సార్లు పొడిగించారు. చివరగా మూడోసారి 2021 డిసెంబర్ 22న ఆయన గడువును పొడిగించగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఆయన పదవిని కోల్పోయారు.
ఉద్యమకారుడు, వినయ్ భాస్కర్ నమ్మిన బంటు
కాకతీయ అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ గా మాస్టర్ జీ విద్యాసంస్థల అధినేత సుందర్ రాజ్ యాదవ్ 2022 ఏప్రిల్ లో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, వరంగల్ పశ్చిమ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కి నమ్మిన బంటుగా పేరున్న ఆయన.. పదవీ బాధ్యతలు తీసుకున్న వెంటనే ల్యాండ్ పూలింగ్ ఇష్యూ తో సతమతమయ్యారు.
వాస్తవానికి రాజకీయాల్లోకి అడుగుపెట్టి కుడా చైర్మన్ నుంచి ఇంకా పైస్థాయి పదవులు అందుకుందామనుకున్న ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం బ్రేకులు వేయగా.. రెండేళ్లు కూడా పదవిలో కొనసాగకుండానే ఆయన రాజకీయ జీవితానికి బ్రేకులు పడ్డాయి. అటు గాడ్ ఫాదర్ గా భావించే వినయ్ భాస్కర్ పవర్ కోల్పోవడం, అటు ఉన్న కూడా చైర్మన్ పదవీ కోల్పోవడంతో సుందర్ రాజ్ యాదవ్ దిక్కు తోచని స్థితిలో పడ్డారు.