YCP Sitting MLAs Issue: వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వనున్న జగన్!
YCP Sitting MLAs Issue: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత షాక్ ఇవ్వబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో భారీగా మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు. కొందరికి నియోజక వర్గాల మారనుండగా మరికొందరకి అసలు టిక్కెట్లు లేవని తేల్చబోతున్నారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థుల్లో అలజడి మొదలైంది.
YCP Sitting MLAs Issue: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరో వారం పదిరోజుల్లో నియోజక వర్గాలకు బాధ్యులను ప్రకటించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 40-50మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనమో లేకుంటే అసలు టిక్కెట్ దక్కక పోవచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2019 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151 మంది ఎమ్మెల్యేలను గెలిచిన వైఎస్సార్సీపీ 2024ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతిపక్షమే లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నా, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే అభ్యర్థుల పనితీరు, ఆరోపణలు, మళ్లీ టిక్కెట్ ఇస్తే గెలిచే పరిస్థితి ఉందా లేదా అనే అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
ఎస్సీలకు రిజర్వు చేసిన ఆరేడు నియోజక వర్గాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకటి రెండు సార్లు అదే నియోజక వర్గాల్లో గెలిచిన వారిని సైతం మరో నియోజక వర్గం నుంచి పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల పూర్తిగా కొత్త వారికి చోటు కల్పించనున్నారు.
రిజర్వుడు నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులుగా ఉన్న వారికి సైతం స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. కొందరు సొంత జిల్లాల నుంచి పొరుగు జిల్లాలో పోటీ చేయాల్సి ఉంటుందని ఇప్పటికే సూచన ప్రాయంగా సమాచారం ఇచ్చారు.ఎమ్మెల్యేలుగా గెలిచే అవకాశాలు లేని వారికి టిక్కెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పేస్తున్నారు. రెండు సార్లు గెలిచిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు ఎంపీలుగా పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని సూచించినట్టు సమాచారం.
శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు అన్ని జిల్లాల్లో దాదాపు 50మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి పోటీ చేసే అవకాశం లభించకపోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలను నేరుగా పిలిపించుకుని ఈ విషయాన్ని వారికి తెలియ చేసే అవకాశాలున్నాయి. ఇతర మార్గాల్లో సమాచారం లీక్ కావడంతోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, గాజువాక ఇంచార్జి రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది.
గెలిచే అవకాశాలు లేని వారితో మొహమాటానికి పోయి తెలంగాణ మాదిరి ప్రతికూల ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచన వైసీపీ అధినేతలో ఉంది. ప్రస్తుత క్యాబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులను వారి జిల్లా నుంచి పొరుగు జిల్లాలో పోటీ చేయించే అవకాశాలున్నాయి. తిరుపతి జిల్లా నుంచి లోక్‌సభకు ప్రతినిధ్యం వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేల స్థానాలు తారుమారు కానున్నాయి. ఎంపీ గురుమూర్తిని అసెంబ్లీకి, మంత్రి నారాయణ స్వామిని పార్లమెంటుకు పోటీ చేయించే ఆలోచన ఉన్నట్టు సమాచారం.
మంత్రులు ఆదిమూలపు సురేష్‌ను పార్లమెంటుకు, మేరుగు నాగేశ్వరరరావును ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేయించనున్నారు. మాజీ మంత్రి మేకతోటి సుచరితకు కూడా స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. పినిపె విశ్వరూప్ తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నా ఆయన్నే మళ్లీ పోటీ చేయాలని ఆదేశించే అవకాశాలున్నాయి. సుధాకర్ బాబు, హెన్రీ క్రిస్టినా వంటి వారికి ఇతర నియోజక వర్గాల బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అభ్యర్థుల్ని మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
వేర్వేరు బృందాల నుంచి సేకరించిన సమాచారం ఆధారం ఏ మాత్రం గెలిచే అవకాశం లేని అభ్యర్థులను పూర్తిగా పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2024ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వస్తే వారి గౌరవానికి భంగం కలగకుండా అవకాశాలు, పదవులు కల్పిస్తామని బుజ్జగించనున్నారు. బెట్టు చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని భావిస్తున్న వైసీపీ అందుకు అనుగుణంగా ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు సైతం అభ్యర్థుల జాబితా నుంచి మాయమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.