Telangana Assembly : నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ, ఎమ్మెల్యేల ప్రమాణం -ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్‌ ఒవైసీ

 Telangana Assembly : నేడు కొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ, ఎమ్మెల్యేల ప్రమాణం -ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్‌ ఒవైసీ

Telangana Assembly Session : ఇవాళ తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు మొదలుకానున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు గెజిట్ విడుదల చేశారు.

Telangana Assembly Session : శనివారం కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త స్పీకర్ ఎన్నిక ఇవాళ ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

ప్రొటెం స్పీకర్‌…

ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు ఇవ్వటం సంప్రదాయంగా వస్తుంది. ఎంఐఎంకు చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. శనివారం ఉదయమే రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై అక్బరుద్దీన్‌తో ప్రమాణం చేయిస్తారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే దీనిపై బీఏసీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తొలిరోజు మాత్రం సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. తిరిగి సమావేశాలు ఈనెల 13 నుంచి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ మరుసటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగిస్తారు. తర్వాతి రోజు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు.

స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పదవి కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ను ఖరారు చేసింది కాంగ్రెస్. నోటిఫికేషన్ విడుదలైన అయిన తర్వాత… సభ్యులు ఆయన్ను స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత కొత్త స్పీకర్‌ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి.

రాజాసింగ్ కీలక నిర్ణయం

గోషామాల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన ప్రకటన చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరిస్తే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని స్పష్టం చేశారు.

మరోవైపు కొత్త అసెంబ్లీ కొలువుదీరనున్న నేపథ్యంలో… అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతపరమైన అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టిపెట్టారు. ఏర్పాట్లపై సీఎస్ తో పాటు డీజీపీ పర్యవేక్షించారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *