Bank Employees Salaries: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..వేతనాల పెంపుపై కార్మిక సంఘాలతో ఐబిఏ ఒప్పందం

 Bank Employees Salaries: బ్యాంక్ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌..వేతనాల పెంపుపై కార్మిక సంఘాలతో ఐబిఏ ఒప్పందం

Bank Employees Salaries: బ్యాంకు ఉద్యోగులకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ తీపి కబురు అందించింది. వేతన సవరణతో పాటు ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌కు యాజమాన్యాలు సానుకూలంగా స్పందించాయి. ఈ మేరకు కార్మిక సంఘాలతో ఒప్పందం కుదరింది.

Bank Employees Salaries: వేతన సవరణపై ప్రభుత్వ రంగ బ్యాంకుల యాజమాన్యాలతో కార్మికులకు అవగాహన కుదిరింది. యాజమాన్యాల తరపున ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌‌కు ఉద్యోగ సంఘాల మధ్య వేతనాల సవరణకు అంగీకారం కుదిరింది. గురువారం జరిగిన చర్చల్లో ఇరుపక్షాల ప్రతినిధులు వేతన సవరణ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఐదేళ్ల పాటు ఈ పెంపుదల అమల్లో ఉండనుంది.

బ్యాంకు యాజమాన్యాల తరపున ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు బ్యాంకింగ్‌ ఉద్యోగ సంఘాలకు మద్య గత కొద్ది నెలలుగా వేతన సవరణపై చర్చలు జరుగుతున్నాయి. బ్యాంకుల్లో క్లరికల్ సిబ్బంది, ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలకు.. యాజమాన్యాల సంఘానికి మధ్య పలు విడతలు చర్చలు జరిగాయి.

వేతన పెంపుపై పరస్పర అవగాహన కుదరడంతో ఇరు పక్షాలు ఒప్పందంపై సంతకాలు చేశాయి. బ్యాంకింగ్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, సమస్యలను అధిగమించేలా ఇరు పక్షాలు కలిసి పనిచేయాలని తీర్మానించాయి. ఖాతాదారులకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు సమర్ధవంతమైన సేవలను అందించాలని నిర్ణయించారు.

17శాతం మేరకు పెరుగనున్న వేతనాలు..

2022 నవంబర్ 1 నుంచి బ్యాంకు ఉద్యోగులకు కొత్త వేతన సవరణ అమల్లోకి రానుంది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులను 17శాతం మేర పెంచేందుకు అంగీకారం కుదిరింది. 2021-22 వార్షిక వేతనాలపై ఈ పెంపుదల వర్తింప చేయనున్నారు. వేతనాల పెంపుతో ఎస్‌బిఐ సహా ప్రభుత్వ రంగ బ్యాంకులపై రూ.12,449కోట్ల రుపాయల వ్యయం కానుంది.డిఏ అలవెన్సుల చెల్లింపులకు మరో రూ.1795కోట్లను వెచ్చించనున్నారు.

వార్షిక వేతన పెంపును 2021-22 బ్యాంకుల సంస్థాగత వ్యయాల ఆధారంగా ఆఫీసర్లు, క్లరికల్ సిబ్బందికి వేర్వేరుగా అమలు చేస్తారు.ఉద్యోగ సంఘాల డిమాండ్ మేరకు రిటైర్డ్ ఉద్యోగులైన పెన్షనర్లకు కూడా తాజా వేతన సవరణ పెంపుదలను వన్‌ టైమ్ ప్రాతిపదికన అమలు చేస్తారు. పెన్షనర్లు 2022 అక్టోబర్ 31న అందుకున్న మొత్తాలపై ఈ పెంపుదల ఉంటుంది. నెలవారీ పెన్షన్‌తో పాటు వారి అదనపు చెల్లింపును వర్తింప చేస్తారు. ఎంతకాలం పాటు ఈ పెంపుదల అమలు చేయాలనే దానిని తర్వాత నిర్ణయిస్తారు. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగులకు ఎలాంటి అలవెన్సులు వర్తించవని పేర్కొన్నారు.

ఐదు రోజుల పని దినాలకు సుముఖత

మరోవైపు ఐదు రోజుల పనిదినాల డిమాండ్‌ను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. నెగోషిబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం బ్యాంకులకు ఐదు రోజుల పని దినాలను వర్తింప చేయడంపై కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్నారు.

బ్యాంకు యాజమాన్యాల తరపున చర్యలకు ప్రాతినిధ్యం వహించిన వారిలో సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి సీఈఓలతో పాటు ఐబిఏ ప్రతినిధులు ఉన్నారు.

బ్యాంకు కార్మిక సంఘాల తరపున ఏఐబిఈ‎ఏ ప్రతినిధులు, నేషనల్ ఫెడరేషన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ బ్యాంక్ ఎంప్లాయిస్ ప్రతినిధులు సంతకాలు చేశారు.

అధికారుల సంఘాల తరపున ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ సంఘాలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.

 

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *