Coffee On Empty Stomach: పరగడుపున కాఫీ తాగడం మాని.. ఈ సమయంలో తాగితే లాభాలెక్కువ
Coffee On Empty Stomach: కాఫీ పరిగడుపున తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ దానివల్ల కలిగే లాభాలు కూడా తగ్గిపోయి అనవసరమైన అనారోగ్య సమస్యల భారిన పడాల్సి వస్తుంది. కాఫీ ఎప్పుడు తాగితే మంచిదో వివరంగా తెల్సుకోండి.
ఉదయాన్నే ఓ కప్పు కాఫీతోనే చాలా మందికి ఆ రోజు ప్రారంభం అవుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా వారు ఈ అలవాటును కలిగి ఉంటారు. ఒక్క రోజు ఎప్పుడైనా కాఫీ దొరక్కపోతే ఆ రోజు ఏదో కోల్పోయిన భావనలోనే ఉంటారు. అయితే రోజుకు ఒక కాఫీ వరకు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని అంటుంటారు. కాకపోతే పరగడుపున దీన్ని తాగవద్దని సూచిస్తున్నారు. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కాఫీ తాగడం వల్ల హార్మోన్లు ఎక్కువగా ప్రభావితం అవుతాయని చెబుతున్నారు. అందువల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు.
కాఫీ పొద్దున తాగితే ఏమవుతుంది?
- కాఫీలో ఆమ్లత్వం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఖాళీ పొట్ట చికాకుకు గురవుతుంది. దీంతో గ్యాస్, పొట్ట ఉబ్బరం, గుండెల్లో మంట.. తదితర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి.
- కాఫీలో ఉండే కెఫీన్ శరీరంలో మూత్రం తయారు కావడాన్ని పెంచేస్తుంది. అందువల్ల ఎక్కువగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. శరీరం డీ హైడ్రేట్ అవుతుంది.
- పరగడుపున కాఫీ తాగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఆందోళనన, ఒత్తిడి లాంటివి కలిగి కంగారు కంగారుగా ఉండటం లాంటి చెడు ప్రభావాలు కలుగుతాయి.
- కాఫీ వల్ల తలెత్తిన హార్మోన్ల అసమతుల్యత వల్ల మొటిమలు, గుల్లలు, తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపించడం లాంటివి చోటు చేసుకుంటాయి. అంతగా ఇది మన చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
- ఇలా ఆందోళన ఎక్కువ కావడం వల్ల క్రమంగా నిద్రా భంగం కలుగుతుంది. తొందరగా నిద్ర పట్టదు. ఒకవేళ పట్టినా మళ్లీ మధ్య మధ్యలో మెలుకువ వచ్చేస్తూ ఉంటుంది. నిద్ర నాణ్యత బాగా దెబ్బ తింటుంది. అందువల్ల ఆందోళన, ఒత్తిడి స్థాయిలు మరింతగా పెరిగిపోతాయి. దీంతో శరీరానికి విశ్రాంతి దొరకక ఇబ్బందిగా ఉంటుంది. గుండె దడ దడగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది.
- మూడ్‌ని కాఫీ మెరుగుపరుస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది. అందుకనే మనం కూడా ఏ మాత్రం చికాకుగా అనిపించినా వీలైతే కప్పు కాఫీ తాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ఈ లాభాలు అన్నీ ఏదైనా తిన్న తర్వాత కాఫీ తాగినప్పుడు మాత్రమే కలుగుతాయి. అలా కాకుండా పరగడుపునే దీన్ని తాగడం వల్ల మూడ్ మెరుగుపడటానికి బదులుగా చికాకు ఎక్కువ అవుతుంది. ఆరోగ్యంపై దుష్ప్రభావాలు కలుగుతాయి.