Revanth Reddy : తెలంగాణపై తుపాను ప్రభావం, అవసరమైన సహాయ చర్యలు తీసుకోండి- రేవంత్ రెడ్డి
Revanth Reddy : మిచౌంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు.
Revanth Reddy : మిచౌంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుపాను ప్రభావం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సందిగా టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో జన జీవనం స్తంభించకండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పలు ప్రాంతాల్లో వరి ధాన్యం తడిచిపోయే అవకాశం ఉందని, దీనిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. ధాన్యం తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు దృష్టిపెట్టాలన్నారు. ఎక్కడికక్కడ రైతులకు అండగా నిలిచి, పలు సూచనలు చేయాల్సందిగా కోరారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో తుపాను కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలరెట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ, యాదాద్రి, భూపాలపల్లి, సిద్ధిపేట, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణ పేట్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఐఎండీ అలర్ట్ లకు అనుగుణంగా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి”- రేవంత్ రెడ్డి
అధికారులకు సూచనలు
- వరి ధాన్యం ఆరబెట్టుకున్న రైతుల విషయంలో ధాన్యం తడిసిపోకుండా జాగ్రత్తలు
- తీసుకోవాలి. అవసరమైతే టార్పాలిన్లు ప్రొవైడ్ చేయగలుగుతామా, ఇతర ముందు జాగ్రత్తలు ఏమైనా సూచించగలుగుతామా అనేది చూడాలి.
- ఈశాన్య జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నందున అక్కడి అధికారులను అప్రమత్తం చేయాలి.
- లోతట్టు ప్రాంతాలు, వాగులు ఉన్న ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహాన్ని ముందే అంచనా వేసి, ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉంటే, అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. తుపాను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం, సురక్షిత నీరు అందేలా చూడాలి.
- ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. విద్యుత్, రహదారులు దెబ్బతిన్న ప్రాంతాలు ఏమైనా ఉంటే వెంటనే పునరుద్ధిరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- పురాతన భవనాలు, నిర్మాణాలు ఏమైనా ఉంటే ముందే గుర్తించి అక్కడ నివసించే వాళ్లను ఖాళీ చేయించాల్సిందిగా సూచిస్తున్నానని అని రేవంత్ రెడ్డి అన్నారు.