Michaung Cyclone Live news Updates: తీరం దాటిన తీవ్ర తుపాను, ఏపీలో వర్ష బీభత్సం
Michaung Cyclone Live news Updates: మిచాంగ్ తుఫాను ప్రభావంతో 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ ,ప.గో., ఏలూరు, కోనసీమ జిల్లాలకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Tue, 05 Dec 202308:26 PM IST
పాలకొల్లులో సుడిగాలులు బీభత్సం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం తెల్లపూడిలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. సానివాడలో సుడిగాలితో కొబ్బరి చెట్లు నేలకూలాయి. సుడిగాలులు దాటికి ఇంటి పైకప్పులు కూలిపోయాయి.
Tue, 05 Dec 202305:41 PM IST
వెంకటగిరిలో నిన్న రాత్రి నుంచీ నిలిచిన విద్యుత్ సరఫరా
మిచౌంగ్ తుపాను ప్రభావంతో కురుస్తోన్న వర్షాలకు తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిన్న రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లైన్లతో సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరా బంద్ అయినట్లు తెలుస్తోంది.
Tue, 05 Dec 202304:47 PM IST
ఎలా ఉన్నా ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది- మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
మిచౌంగ్ తుపాను బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో పర్యటించిన మంత్రి కారుమూరి వరి చేలను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ… ఎలాంటి పరిస్థితిలో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని తెలిపారు. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించాలని సూచించారు. ఆఫ్లైన్, ఆన్లైన్ రెండు విధాలుగానూ ధాన్యాన్ని తరలించే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ఏ మిల్లర్లు అయినా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Tue, 05 Dec 202304:15 PM IST
తీరం దాటిన తీవ్ర తుఫాను మిచౌంగ్
మిచౌంగ్ తుపాను బాపట్ల సమీపంలో తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తీవ్ర తుపాను…. తుపానుగా బలహీనపడనుంది.
Tue, 05 Dec 202303:52 PM IST
ఏలూరు జిల్లాలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు
నిన్నటి నుంచి ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేశారు.
ఏలూరు జిల్లాలో కంట్రోల్ రూమ్ లు
ఏలూరు జిల్లా కలెక్టరేట్ – 18002331077
నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం – 08656-232717
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం – 9553220254
ఏలూరు ఆర్డీఓ కార్యాలయం- 8500667696
Tue, 05 Dec 202303:42 PM IST
పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్రంగా పంటనష్టం
మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. ఉండి , భీమవరం, కాళ్ల ప్రాంతాల్లో తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కోతలు కోసిన రైతులు కల్లాల్లో ధాన్యం తడిసిపోయాయని ఆవేదన చెందుతున్నారు. ధాన్యం నానిపోయిందని, కోసిన వరి పనలు నీట మునిగాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వరి చేలు నేలకు ఒరిగి నీటి మునిగాయి. కలిదిండి, ఉండి, పెదపాడు, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లో వరి చేలు నీట మునిగాయి.
Tue, 05 Dec 202303:20 PM IST
మరికాసేపట్లో బాపట్ల తీరం దాటనున్న తుపాను
మిచౌంగ్ తుపాను బాపట్ల తీరాన్ని తాకింది. కాసేపట్లో బాపట్ల తీరాన్ని పూర్తిగా దాటనుంది. తీరం దాటాక తుపాను బలహీనపడనుంది.
Tue, 05 Dec 202302:56 PM IST
రాజమండ్రి నుంచి పలు విమాన సర్వీసులు నిలిపివేత
తుపాను ప్రభావంతో రాజమండ్రి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. రాజమండ్రి నుంచి వివిధ రాష్ట్రాలను వెళ్లాల్సిన 18 విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.