Cyclone Michaung: నెల్లూరుకు సమీపంలో మిచౌంగ్ తుఫాను…కోస్తాలో భారీ వర్షాలు

 Cyclone Michaung: నెల్లూరుకు సమీపంలో మిచౌంగ్ తుఫాను…కోస్తాలో భారీ వర్షాలు

Cyclone Michaung: ఏపీలోని కోస్తా తీరం వైపు మిచౌంగ్ తుఫాను దూసుకోస్తోంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల మీదుగా కదులుతోంది. తుఫాను ప్రభావంతో కోస్తాలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాను వేగంగా తీరంవైపుకు దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 20కి.మీ, బాపట్లకు 110 కి.మీ దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. కోస్తా అంతట భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుపాను కారణంగా కోస్తాంధ్రతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావం కొంత భాగం సముద్రంలో.. మరికొంత భూమిపై ఉన్నట్లు వెల్లడించింది. గడిచిన 6 గంటలుగా గంటకు 7కి.మీ వేగంతో ఉత్తర దిశగా తుపాను కదులుతున్నట్లు తెలిపింది.

సైక్లోన్‌ ఎఫెక్ట్‌తో కోస్తాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు, జిల్లా, కృష్ణా జిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. నాగాయలంక మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

భారీ వర్షాలతో నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. జిల్లాలోని తీర ప్రాంతంలోని 9 మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలోని గోగర్భం, పాపవినాశనం జలాశయాల గేట్లను తితిదే అధికారులు ఎత్తివేశారు. భారీగా చేరిన వరదనీటితో జలాశయాలు పూర్తిగా నిండిన కారణంగా ఒక్కో గేటును ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

భారీ వర్షాలు, తీవ్రమైన గాలులతో బాపట్ల జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చినగంజాం మండలంలో 15 గంటలుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 10వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

తుపాను ప్రభావంతో వీస్తున్న గాలుల తీవ్రతకు కొన్నిచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భారీ వర్షాలతో పంటపొలాల్లోకి వరదనీరు చేరింది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈదురుగాలులకు వేలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలకు నష్టం కలిగింది. పలుచోట్ల ధాన్యం బస్తాలు తడిసిపోయాయి.

బాపట్ల జిల్లా నిజాంపట్నం సమీపంలో తీరం తాకవచ్చనే సూచనతో తీర ప్రాంత ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. 10వ నంబర్‌ హెచ్చరిక జారీ చేయడంతో తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని భయాందోళన చెందుతున్నారు. హార్బర్ వద్ద సముద్ర తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్లిన బోట్లన్నీ ఇప్పటికే ఒడ్డుకు చేరి.. జెట్టి వద్ద నిలిచిపోయాయి. వలలు, బోట్లు జాగ్రత్త చేసుకునే పనిలో జాలర్లు నిమగ్నమయ్యారు. మరోవైపు, తుపాన్‌ తీవ్రత దృష్ట్యా మంగళవారం కూడా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *