Moongdal Idli: పెసరపప్పుతో స్పాంజీ ఇడ్లీలు.. మరింత రుచికరంగా..
Moongdal Idli: బియ్యం లేదా రవ్వకు బదులుగా పెసరపప్పు వాడి ఇడ్లీలు చేసుకోవచ్చు. స్పాంజీగా, రుచిగా బాగుంటాయి. వాటి తయారీ ఎలాగో చూసేయండి.
ఇడ్లీలంటేనే నూనె లేకుండా చేసుకునే ఆరోగ్యకరమైన అల్పాహారం. అయితే ఇడ్లీలు చేయడానికి బియ్యం వాడకుండా కేవలం పెసరపప్పు, మినప్పప్పుతో మరింత ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు. అవి కూడా చాలా రుచిగా ఉంటాయి. పెసరపప్పు వాడి చేసే ఈ ఇడ్లీలు రుచిలో కొత్తగా ఉంటాయి. తయారీ ఎలాగో చూసి చేసేయండి.
కావాల్సిన పదార్థాలు:
సగం కప్పు పెసరపప్పు
సగం కప్పు మినప్పప్పు
2 పచ్చిమిర్చి
1 కప్పు పెరుగు
1 చెంచా అల్లం తురుము
తగినంత ఉప్పు
పావు చెంచా పసుపు
చిటికెడు ఇంగువ
2 చెంచాల నూనె
తయారీ విధానం:
- ముందుగా పెసరపప్పు, మినప్పప్పును కడుక్కుని నానబెట్టుకోవాలి. 4 నుంచి 5 గంటలు నానితే సరిపోతుంది.
- ఆ తరువాత పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, నానబెట్టిన మినప్పప్పు, పెసరపప్పు, ఉప్పు మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి.
- ఈ పిండిని కనీసం 6 నుంచి 7 గంటల పాటూ పులియబెట్టుకోవాలి.
- తర్వాత పసుపు కాస్త కలుపుకుని పిండిని బాగా కలుపుకోవాలి. అవసరమైతే ఈ పిండితో కాస్త నూనెలో ఆవాలు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకొని కలుపుకోవచ్చు. రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. లేదంటే ఈ పిండితో నేరుగా ఇడ్లీలు చేసుకోవచ్చు.
- ఇప్పుడు ఇడ్లీ పాత్రలకు నూనె లేదా నెయ్యి రాసుకుని గరిటెడు పిండి పోసుకుని ఆవిరి మీద ఉడికించుకుంటే చాలు. రుచికరమైన పెసరపప్పు ఇడ్లీలు రెడీ అయినట్లే.
- ఈ ఇడ్లీలను కూడా సాంబార్ లేదా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి.