Boiled Egg Or Omelette: ఉడికించిన గుడ్డు, ఆమ్లెట్.. రెండిట్లో ఏది మంచిది?
Boiled Egg Or Omelette: ఉడికించిన గుడ్లు, ఆమ్లెట్ ఈ రెండింట్లో ఏది తింటే మంచిదో అనే సందేహం ఉంటుంది. అందుకే ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోండి.
పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా గుడ్లను రోజువారీ ఆహారంలో ఎక్కువగా తింటూ ఉంటారు. ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో సుమారు 77 క్యాలరీలు ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, బీ5, బీ6, బీ12, డీ, ఈ, కేలు దొరుకుతాయి. ఫోలేట్, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇన్ని విటమిన్లు మినరళ్లతో పాటు ఒక గుడ్డులో దాదాపుగా ఆరు గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది. అందుకనే గుడ్డును మంచి ప్రొటీన్‌కి మూలం అని చెబుతారు. మరి ఇన్ని పోషకాలు దొరికే వీటిని అసలు ఎలా తినాలి. ఉడికించి తినడం మేలా? లేదా ఆమ్లెట్లా చేసుకుని తినడం మంచిదా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్లు:
ఆమ్లెట్ మంచిదా? ఉడకబెట్టిన గుడ్డు మంచిదా? అనే విషయంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే దేని వల్ల కలిగే ప్రయోజనాలు దానికి ఉన్నాయి. వీటిలో ముందుగా ఉండికించిన గుడ్ల గురించి తెలుసుకుందాం. ప్రొటీన్‌ని ఎక్కువగా తీసుకోవాలని అనుకునే వారు ఉడికించిన గుడ్లను తీసుకోవడం ఉత్తమం. ఇంకా ఇందులో కోలిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు, నాడీ వ్యవస్థ పని తీరుకు అత్యావశ్యకం. దీనిలో లుటీన్, జియాంక్సతిన్ అనేవి రెండూ చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి గుడ్డు పచ్చ సొనలో ఎక్కువగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికీ ఇవి మేలు చేస్తాయి. ఇవి వయసుతో పాటుగా పెద్దవారిలో వచ్చే శుక్లాలను తగ్గించడంలో ఎంతగానో సహకరిస్తాయి. వీటిలో సహజంగా ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
ఆమ్లెట్లలో పోషకాలు:
ఇక ఆమ్లెట్ల విషయానికి వస్తే.. సాధారణంగా వీటిని తయారు చేసేప్పుడు ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, క్యాబేజీ, క్యారెట్, ఉల్లి కాడలు, బచ్చలి, కొత్తిమీర, క్యాప్సికం.. లాంటి రకరకాల కూరగాయల్ని ఇందులో వాడుతూ ఉంటారు. అందువల్ల సహజంగానే ఇందులోకి పీచు పదార్థాలు వచ్చి చేరతాయి. ఈ ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యకరంగా మారుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. దీనిలో ఉండే ఐరన్ వల్ల ఎర్ర రక్త కణాలు తగినంతగా ఉత్పత్తి అవుతాయి. వాటి ద్వారా శరీర అవయవాలు అన్నింటికీ చక్కగా ఆక్సిజన్ రవాణా జరుగుతుంది. రక్త హీనతతో బాధపడేవారు ఆమ్లెట్‌ని చేసుకునేప్పుడు అందులో కాసిన్ని బచ్చలి ఆకుల్ని తరిగి వేసుకోండి. పుష్కలంగా ఇనుము అందుతుంది. రక్త వృద్ధి జరుగుతుంది. ఇందులో వేసే కూరగాయ ముక్కల వల్ల విటమిన్ సి లాంటివి అదనంగా దొరుకుతాయి. అందువల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల మన కణాలు ప్రభావితం కాకుండా రక్షణ పొందుతాయి.