Raja Singh: చావనైనా చస్తాను కానీ ఆ పార్టీల్లోకి వెళ్లను.. స్పష్టం చేసిన రాజా సింగ్..
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలుచుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎన్నికయ్యారు. హిందు వాదామే ప్రధాన ఏజెండాగా రాజా సింగ్ పని చేస్తున్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆయన్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రాజా సింగ్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుఫున పోటీ చేస్తారని గోషామహల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి తప్పితే ఇతర పార్టీల నుంచి పోటీ చేయనని చెప్పారు.
తన ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ.. సెక్యూలర్ పార్టీల్లో చేరే ప్రసక్తే లేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. ” నేను చచ్చినా సెక్యూలర్ పార్టీల్లోకి వెళ్లను. నా ప్రాణం పోతున్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాల్టీల్లోకి పోను. తెలంగాణను హిందు రాష్ట్రం చేయాలని నా లక్ష్యం. బీజేపీ నుంచి టికెట్ రాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా. కానీ ఇతర పార్టీల్లో వెళ్లను. హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటూ ముందుకెళ్తా.. బీజేపీ నా విషయంలో అనుకూలంగా ఉంది. నాపై సస్పెన్షన్ ఎత్తివేస్తారని నమ్మకం ఉంది” అని రాజా సింగ్ స్పష్టం చేశారు.
గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఎంఐఎం చేతిలో ఉందన్నారు. అందుకే ఆ స్థానాన్ని పెండింగ్ లో పెట్టారని చెప్పారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు. తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మునవర్ ఫారుఖీ హైదరాబాద్ లో పర్యటనను వ్యతిరేకించిన రాజా సింగ్.. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో బీజేపీ అధిష్ఠానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ వివాదాస్పద కేసులో రాజా సింగ్ జైలుకు కూడా వెళ్లొచ్చారు.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో రాజా సింగ్ భార్య ఉషాబాయ్ పార్టీ అధ్యక్షుడిని కలిశారు. రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ నాయకురాలు విజయశాంతి కూడా అప్పట్లో కోరారు. బీజేపీ కార్యకర్తులు కూడా రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయాలని కోరుతున్నారు. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసే అవకాశం ఉంది.