పుట్టమీద కొట్ట చచ్చునా సర్పంబు?

 పుట్టమీద కొట్ట చచ్చునా సర్పంబు?

శ్రీ శుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! వైవస్వత మనువు పదిమంది పుత్రులలో పెద్దవాడు ఇక్ష్వాకుడు. దినమణి- సూర్యవంశానికి మణిమకుటం వంటి మహారాజు. ఈ మహాపురుషుని పేరు మీదే శ్రీరాముడు ‘ఇక్ష్వాకు కుల తిలకుడు’ అని ప్రఖ్యాతి పొందాడు. ఇక్షాకుని పౌత్రుడు కకుత్‌స్థుడు. సురాసుర సమరంలో వృషభ (ఆబోతు) రూపం ధరించిన అమరేంద్రుని కకుదాన్ని- మూపురాన్ని అధిరోహించి అసుర సంహారం చేసి అమరులకు ఆనందం కలిగించాడు. అందుకే ‘కకుత్‌స్థుడు’ అన్న పౌరుష నామం ఇతని పట్ల ప్రసిద్ధమైంది.

ఈ వీరుని నామం మీదుగానే ఇనకుల తిలకుడు రామచంద్రుడు ‘కకుత్‌స్థ వంశ కలశాంబుధి సోముడు’ అని కూడా అవనిపై ఖ్యాతిని గడించాడు. ఈ ఇన (సూర్య) వంశంలోనే కకుత్‌స్థునికి పదహారవ తరం వాడు భూజాని- చక్రవర్తి మాంధాత. మహావీరుడు. రావణుని వంటి మహాయోధుని కూడా భయభ్రాంతుని గావించి ‘త్రసదస్యుడు’ అని బిరుదు వహించిన వాడు. శతబిందుని పుత్రిక ‘బిందుమతి’ ఇతని శ్రీమతి. ఆ ఇందుముఖి యందు మాంధాత ముగ్గురు పుత్రులను- పురుకుత్స, అంబరీష, ముచుకుందులు, ఏబది మంది పుత్రికలను పొందాడు. ఈ చక్రవర్తి కాలంలోనే జరిగిన సౌభరి మహర్షి చరిత్ర మహాచిత్రము, ముముక్షువులకు మహోపదేశ ప్రదమూ అయినది.

సౌభరి రుగ్వేదీయ రుషి. కణ్వ మహర్షి కుమారుడు. అధ్యాత్మ సాధకులకు చేటు కలిగించే విశృంఖల విషయ భోగం వికటించి, వెగటు- రోత కలిగి, విరక్తి పుట్టి, వాస్తవ వైరాగ్యం చోటుచేసుకున్న పిమ్మట, విచార శీలుడైన సౌభరి మహర్షి వెలువరించిన పశ్చాత్తాప పూర్వక అంతర్మథనాన్ని ఓరుగల్లు కవితా చేతన- పోతన యథానుసరణంగా అనువదించిన తీరు కావ్యపరంగా పన్నీటి జల్లులా, మనసుకు చల్లగా.. ఎంత కమనీయంగా, శ్రావ్యంగా ఉందో చూడండి…

చ॥ ‘మునినట! తత్తవేదినట! మోక్షమకాని సుఖంబు లెవ్వియుం
జనవఁట! కాంత లేఁబదట! సౌధచయం బఁట వాసదేశముం
దనయులు నైదువేలఁట! నిదానము మీనకుటుంబి సౌఖ్యముం
గనుటఁట! చెల్లరే నగవుగాక మహాత్ములు సూచి మెత్తురే?’

సౌభరి ఇలా తలపోశాడు… ‘నేనొక మునినా? అందునా తత్త్వం బాగా తలకెక్కిన వాడనా? మోక్షసుఖం తప్ప ఇతర సుఖాల, మఖాల (యజ్ఞ, యాగాల) వైపు మళ్లే మనసుగల వాడను కానా? అట్టి నాకు అర్ధశతం అర్ధాంగీమణులా? అందమైన భవనాలు నివాస సదనాలా? ఐదువేల మంది కొడుకులా? దీనికంతకూ ఏకైక కారణం ఏమిటంట? యమునా జలంలో చేపల జంట మైథున సౌఖ్యం నా కంట పడటమా? ఆహా! ఔరా! నవ్వి నొచ్చుకొని పోయే విషయమే కాని ఇది మహాత్ములు చూచి మెచ్చుకొనే మాటా?’

సౌభరి బాల్యమంతా గురుకులంలో గడిపి వేదవేదాంగాలలో పారంగతుడైన మహా మేధావి. సాధారణంగా అధ్యయనం పూర్తయితే బ్రహ్మచర్య దీక్ష విరమించి వైవాహిక జీవితంలో రమిస్తారు. ప్రాపంచిక- లౌకిక విషయ సుఖాలలోని క్షణికత, సారహీనతను గ్రహించి, అనిత్య భోగానుభవం కొరకు అమూల్య జీవితాన్ని వ్యర్థం చేసుకోరాదని దృఢమైన వివేక, వైరాగ్యాలతో సౌభరి గృహస్థ ధర్మం స్వీకరించలేదు. తల్లిదండ్రులు యుక్తవయసు వచ్చిన సౌభరికి వివాహం చెయ్యాలని విశ్వప్రయత్నం చేశారు. వారు ఎంతగానో వాదించి, వేధించి, బోధించారు… ‘నాయనా! నీకిప్పుడు నిండు యవ్వనం. వివాహితుడవై రతి సుఖాన్ని, ఉత్తమ సంతతి లాభాన్ని పొంది పితృరుణం తీర్చుకునే తరుణం. వైరాగ్య ధారణకు ఇది సమయం కాదు. వార్ధక్యంలో మునివృత్తిని స్వీకరించి జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు.

ధర్మమార్గంలో జీవయాత్ర సాగిస్తూ, జ్ఞాన విజ్ఞాన దాయకాలైన శాస్ర్తాలలో నిరంతరం పరిశ్రమ సాగిస్తూ, జితేంద్రియులు, అతిథిసేవా తత్పరులైన ఉత్తమ పురుషులకు గృహస్థాశ్రమంలోనే ముక్తి లభిస్తుంది. అలాకాక, మనసు సరి చేసుకోకుండా గృహత్యాగం చేసి గిరికాననా (కొండకోన)లకు, సరిత్‌ (నదీ) తీరాలకు వెళ్లినా మోక్షసిరి వరిస్తుందా? శరీరధారులకు అరిషడ్వర్గం- కామ క్రోధాదులు వెన్నంటి ఉన్నంత వరకు వారు ఇంట ఉన్నా, మింట (ఆకాశంలో) ఉన్నా సంసార భయం సమసిపోదు. నిజానికి వైరిషట్కం తోటి సంబంధమే మేటి సంసార బంధం. ఇంద్రియ నిగ్రహం సాధించినవాడు స్వగృహంలో కూడా తపోమయ జీవితం గడపగలడు. రాగద్వేషాలు విడిచి పుణ్యకార్యాలయందే ప్రవర్తించు మహాత్ములకు గృహమే తపోవనం!’

మాతాపితరుల హిత వచనాలు సౌభరికి బధిర శంఖారావం- చెవిటివాని వద్ద శంఖం ఊదినట్లయింది. వత్తిడి చేస్తే మనసు మెత్తబడి మాట చిత్తగిస్తాడన్న ఆశ కూడా బొత్తిగా అడుగంటి పోయింది. తల్లిదండ్రులను నిరాశకు గురిచేసి సౌభరి బరితెగించి పరివ్రాజకుడై యమునా తీరమే తపస్సుకు సరైనదిగా భావించి ఆ నదీమతల్లి దరి చేరాడు. తపస్సు మీద గురి కుదిరిన సౌభరికి ఆ ఏకాంత స్థలం- ఒంటరి తనం బాగా నచ్చింది. వేదఖని (గని) అయిన ఆ ముని యామున జలంలో మునిగి తపస్సు ఆరంభించాడు. శ్రావణ, భాద్రపదాల్లోని బీభత్సమైన వరదలు కాని, మార్గశిర, పుష్య మాసాల్లో గడగడ లాడించే చలికాని ఆయన చిత్తాన్ని చలింప చేయలేకపోయాయి. ఈ తపస్సు అనే ఉత్సవం వత్సరాల తరబడి నడిచింది. ఎన్నో సంవత్సరాలు గడచిపోయాయి.

పావనమైన యమునా తీరం- బృందావనంలోనే సౌభరి యవ్వనం అంతా అంతరించింది. వృద్ధాప్యం ఆక్రమించింది. శుక ఉవాచ- రాజా! ఒక రోజు ఆ ముని సౌభరి యమునా వారి (జలం)లో పరివార సమేతంగా సంసార సుఖాన్ని చూరలాడే మీన (చేపల) రాజును చూచాడు. సతీపతుల రతిక్రీడలు! ప్రణయ కలహాలు, ప్రేమ ఆలింగనాలు! ఇదే అదనుగ మదినెంచి మదనుడు- కాముడు కదం తొక్కాడు. సమర శంఖం పూరించాడు. రతీపతి జయభేరి మ్రోగించాడు. సౌభరి మతిని గతి తప్పించాడు. చెవులు పట్టుకు ఆడించి, సంసారంలో చవులు పుట్టించి నోరూరించాడు. మహర్షి అంతరాంతరాలలో దాగి ఉన్న ఐహిక భోగవాంఛ భోగిలాగా పడగవిప్పి బుసలు కొట్టింది. అసలు ఫాయిదాలతో సహా వసూలుకు సిద్ధమయింది. ‘వల్మీక తాడనాద్దేవి మృతఃకిను మహోరగః’- ‘పుట్టమీద కొట్ట చచ్చునా భుజగంబు?’- రోజూ చూసే చేపల గుంపులేగా! ముసలితనంలో తలవంపులు కలిగించే ఈ పాపపు తలంపు- వాసన ఎందుకు కలిగింది? తాపం ఎందుకు ఓపలేకపోయాడు? ఇంతవరకు సౌభరి చేసిన తపస్సు దేహదండన మాత్రమే కాని మనోదండన- మనస్సాధీన సాధన కాదు. మనస్సులోని వాసనల తమస్సు (అంధకారం) ఇంకా తొలగనేలేదు.

సౌభరి వైరాగ్యానికి వీడుకోలు చెప్పాడు. కలవంటి తపస్సుకు తిల తర్పణం విడిచాడు. ఆయన వివాహ వాంఛతో మాంధాత వద్దకు వచ్చాడు. అకస్మాత్తుగా ఆస్థానానికి రావడం రాజుకు అమిత ఆశ్చర్యాన్ని కలిగించింది. కల్యాణ కామనతో తన కుమార్తెను కోరి వచ్చాడని తెలిసి కంగారు అధికమైంది. ఈ పండు ముసలయ్యకు కిసలయ (చిగురాకు) కుసుమ (పుష్ప) కోమలమైన తన కన్యకనివ్వడమా! ఇవ్వనంటే కోపంతో శాపం పెడతాడని భయం! రాజు ‘కుమార్తెను ఇస్తాను కాని స్వయంవరంతో స్వీకరించండి’ అన్నాడు. మాంధాత ఆంతర్యం మునికి అర్థమైంది. ‘ప్రాయపు బాల జిగిబిగి లేని నన్ను ఎలా వలచి వరిస్తుంది?’ అని తలపోసి సౌభరి తన తపశ్శక్తినంతా ధారపోసి సౌందర్యం రాశి పోసినట్లుగ నవమన్మథాకారం ధరించి, అంతఃపురంలో ప్రవేశించాడు..

ఉ॥ ‘కోమలులార! వీడు నలకూబరుడో, మరుడో, జయంతుడో!
యేమరి వచ్చె, వీనిఁ దడవేల వరింతుము నేమ యేమ యం
చా ముని నాథుఁజూచి చలితాత్మికలై సొరిదిన్‌ వరించి రా
భామిను లందరున్‌ కుసుమ బాణుఁడు గీయని ఘంట వ్రేయగన్‌’

శుక ఉవాచ- రాజా! మదనుడు పదును తూపు (బాణా)లతో మరులు గొల్పి మోహాన్ని కలిగించగా, సుందరులైన మాంధాత కన్యలందరూ మునీంద్రుని కని, ‘అబ్బా ఎంత అందం! వీడు నలకూబరుడో (రంభాప్రియుడు)! మన్మథుడో! జయంతుడో (ఇంద్రపుత్రుడు)! ఏమరుపాటున ఇచ్చటికి వచ్చాడు. ఇక జాగేల’ అని మనసులు చలించగా ‘నేనంటే నేను’ అంటూ అందరూ అతణ్నే వరించారు.
(సశేషం)

Digiqole Ad

Related post