శ్రావణంలో చేసినట్లు అధిక మాసంలో కూడా వ్రతాలు ఆచరించాల్సిందేనా?

 శ్రావణంలో చేసినట్లు అధిక మాసంలో కూడా వ్రతాలు ఆచరించాల్సిందేనా?

Shravana Masam 2023 |‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమారుడికి చెబుతాడు పరమేశ్వరుడు. అలాంటి పవిత్ర శ్రావణ మాసం ఈ ఏడాది రెండుసార్లు వస్తున్నది. అధిక మాసంలో నిజ శ్రావణ మాసంలా వ్రతాలు ఆచరించాల్సిన సంప్రదాయం లేదు. కానీ, అధిక మాసంలో చేసే దానాలు, జపాలు అధిక ఫలాన్ని ఇస్తాయని పెద్దల మాట. ఈ క్రమంలో పవిత్రమైన శ్రావణం అధిక మాసంగా రావడం ఆధ్యాత్మిక సాధకులకు ప్రత్యేకమైనదిగా భావించొచ్చు.

రెండు అమావాస్యల మధ్య రవి సంక్రమణం జరగని నెలను అధిక మాసంగా పరిగణిస్తారు. చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న కాల భేదాన్ని సరిచేయడానికి అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది. చాంద్రమానంలో ఒకనెలను అధికంగా కలిపి అధికమాసంగా పరిగణిస్తారు. చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం. దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 354 రోజులు వస్తాయి. ఈ ప్రకారం చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరం కన్నా 11 రోజుల, 1 గంటా 31 నిమిషాల 12 సెకండ్లు తక్కువగా ఉంటాయి. అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనకబడుతుంది. ఈ ముప్పయి రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒక నెలను అధికంగా కలుపుతారు. ఈ నెలనే అధికమాసం అంటారు. అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.

అధిక మాసం ఎప్పుడూ చైత్రం నుంచి ఆశ్వయుజం మధ్యలోనే వస్తుంది. ఒకసారి అధిక మాసం వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 34, 35, 38 నెలలకు ఇలా అధికమాసం ఏర్పడుతూ ఉంటుంది. అధిక మాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని కూడా ప్రస్తావిస్తారు. ధర్మ సింధువు ప్రకారం అధిక మాసంలో ఉపాకర్మ, ఉపనయనం, వివాహం, వాస్తుకర్మ, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, యజ్ఞం, సన్న్యాసాశ్రమ స్వీకారం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకరణం మొదలైన కార్యక్రమాలు చేయకూడదు.

ముహూర్తాలతో ప్రమేయం లేకుండా నిత్యం చేసే పూజలు యథావిధిగా కొనసాగించవచ్చు. అదే సమయంలో అధిక మాసంలో జపతపాదులూ, దానాలూ, నదీస్నానాలూ, తీర్థయాత్రలూ సాధ్యమైనంత ఎక్కువగా చెయ్యాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. మరణ సంబంధమైన క్రతువులు (మాసికం, ఆబ్దికం మొదలైనవి) అధిక, నిజమాసాలు రెండింటిలో చేయాల్సి ఉంటుంది.శ్రావణ మాసం అధికంగా రావడం వల్ల వ్రతాలు, నోములూ రెండుసార్లు చేయాలా అనే సందేహం కలగవచ్చు. అధిక మాసంలో ఇవి చేయకూడదు. శుక్రవార పూజలు, మంగళగౌరీ వ్రతాలు అన్నీ నిజమాసంలోనే చేసుకోవాలి. నిత్య దేవతార్చన విశేషంగా చేసుకోవాలి.

 

పుణ్యప్రదం
శ్రీమహా విష్ణువుకు అధికమాసం అంటే ఎంతో ప్రీతి. అందుకనే అధికమాసానికి పురుషోత్తమ మాసం అనే పేరు ఏర్పడింది. స్వయంగా ఆయనే శ్రీమహాలక్ష్మికి ఓ సందర్భంలో పురుషోత్తమ మాస విశిష్టతను వివరిస్తూ ‘ఎవరైతే ఈ మాసంలో పుణ్య నదీస్నానాలు, జపహోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి. అధిక మాసంలో పుణ్యకర్మలు ఆచరించని వారి జీవితాల్లో కష్టనష్టాలు ఎదురవుతాయి. అధిక మాసం శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి నాడైనా పుణ్యకార్యాలు చేయాలి. దానివల్ల వారికి అపారమైన ఫలితం లభిస్తుంద’ని వివరించాడని పురాణ కథనం.

Digiqole Ad

Related post