పశ్చాత్తాపమే నిజమైన ప్రాయశ్చిత్తం

బాదరాయణి శుకముని పరీక్షిత్ భూరమణునితో ఇలాగని వినిపించాడు.. రాజా! విధాత విధానం అలా ఉన్నదని సమాధానపడి మాంధాత తన కన్యలు ఏబది మందిని అనన్య తపశ్శక్తి భరితుడైన సౌభరికిచ్చి వైభవోపేతంగా సరయూ నదీతీరంలో వివాహాలు జరిపించాడు. మహర్షి తన తపోమహిమతో అనేక లీలా వినోదాలను కల్పించి, హాలాపాన మదమత్తుని వలె పంచాశత్ (యాభై) బాలా(కాంతా) మణుల చూపుల సంకెళ్లలో చిక్కుకొని కేళీ విలాసాలలో జీవిత కాలాన్ని వాలాయము- నిరంతరంగా వృథా చేసుకుంటూ చాలా దిగజారిపోయాడు.
కం॥ ‘పెక్కండ్రు రాజముఖులకు
నొక్కఁడు మగఁడయ్యుఁదనియకుండె మునీంద్రుం
డెక్కుడు ఘృత ధారలచే
నక్కజమై తృప్తిలేని యనలుని భంగిన్’
‘తన ఘనమైన వైరాగ్యపు కోట బీటలు వారి తెప్పరిల్లుకోలేని విధంగా కుప్పకూలగా సౌభరి ముని పూటపూటకూ ఒక వింత అనుభవం సొంతం చేసుకుంటూ ఎంతోకాలం ఆ రాజకాంతలతో విహరించాడు. ఐనా, నేతిధారలతో తృప్తిపడని వీతిహోత్రుని (అగ్ని)వలె విషయ భోగరతిలో ఉపరతి- విరక్తి పొందలేకపోయాడు? ఈ సందర్భంలో పోతన మహాకవి అరవింద మరందాల, మూడు కందపద్యాల మధురిమను చవిచూపించాడు..
కం॥ ‘ఆరామంబున మునివరుఁ
డారామలతోడ బహు విహారమయుండై
గారాములఁ దనకిట్టటు
పోరాములు సేసి కొన్ని ప్రొద్దులు పుచ్చెన్’
ఇలా ఆ యతివరుడు అతివల- అర్ధాంగుల, రతి వలలో చిక్కి, హృద్యమైన ఉద్యాన వనాల్లో విహరిస్తూ, వారి కనుసన్నలతో అనురాగాలు కనబరుస్తూ అద్యావధి- ఈనాటి వరకు అవిద్యా (అజ్ఞాన) మోహితుడై గడిపాడు. ఇంతగా సుఖం అనుభవించినా అతృప్తి అనే దుఃఖం ఆయనను వీడక వింతగా వెంటాడుతూనే ఉంది. ఎందుకని? సుఖదుఃఖాలలో దేనిదారి దానిదే! ప్రాపంచిక సుఖం ప్రాపంచిక దుఃఖాన్ని తొలగించలేదు- ఇది తిరుగులేని, విరుగుడు కానరాని ప్రకృతి నియమం!
శుక ఉవాచ- రాజా! ఒక రోజు మాంధాత, ‘కూతుళ్లు జడధారి (తపస్వి)తో ఏమి పాట్లు పడుతున్నారో’ అని కాతరుడై- తల్లడిల్లి, జామాత (అల్లుడి) జాడకై వెదుకుతూ ఒక కారడవిలో మణిమయ భవనంలో రాజమణిలా క్రీడిస్తూన్న మునిని కని చెప్పరాని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందాడు. అల్లుడి మన్ననలందుకొని మెల్లన తన తనయ (పిల్లల)ల వద్దకు వచ్చి…
‘కన్నతల్లులారా! మీవారు మిమ్ములను మేలుగా ఏలుకుంటున్నారా?’ అని అడిగాడు. పెళ్లికి ముందు ఎంతో కలివిడిగా ఉన్న వారందరూ విడివిడిగా- ‘నాన్నగారూ! వారెప్పుడూ నాతోనే విడువక ఉంటారు. మందభాగ్యలైన నా సోదరీమణులు వారి పొందు కోరుతూ ఎంత కుందుతున్నారో అన్నదొక్కటే నాకున్న బాధ’ అన్నారు. మాంధాతకు మహర్షి యోగశక్తి మహాశ్చర్యాన్ని కలిగించింది.
కం॥ ‘నా తోడులార! మీ పతి
మీ తోడే? పనుల యెడల మేలే యనుడున్
‘నా తోడిదె నా తోడిదె
తాతామే’లనుచు ననిరి తరుణులు వరుసన్
కొంతకాలానికి లౌకిక బంధాలకు చిక్కి వంతలపాలైన రుగ్వేద రుషి సౌభరి ఒకరోజున ఒంటరిగా కూర్చొని అంతర్ముఖుడై పశ్చాత్తాపంతో ఇలా పలవరించాడు… ‘క్షణకాలం జలంలో చేపల జంట పొత్తు వీక్షణం వలన అక్షుణ్నమైన (తరగని) నా తపమంతా తత్‌క్షణమే చిత్తయిపోయింది. స్వరూప (ఆత్మ) స్మృతి బొత్తిగా లోపించింది… ఉపవాసాలతో శుష్కింప చెయ్యడమో, ఇంద్రియ సుఖాలతోడి పొత్తు వదలిపెట్టడమో, తపస్సాధనతో చిత్తాన్ని శోధించి, దానిని భగవదాయత్తం కావించడమో చేయక, నేనెందుకీ మోహగర్తం (గుంట)లో పడ్డాను? నా తపమంతా కామాగ్నిలో హుతమై పోయిందిగా! హతవిధీ! (అయ్యో!) ఈ కితవ (కపట) కామినుల కౌగిళ్లు తపోవ్రతులైన మునులకు కైవల్యా(మోక్షా)న్ని కలిగిస్తాయా? ఇది పతనానికి పరాకాష్ఠ కదా!
ఉపవాసమంటే కేవలం కాయ (శరీర) శోషణం- శరీరాన్ని ఎండగట్టడం కాదు. మనస్సనే మాయను మర్దించి జీవాత్మ ఆనంద పెన్నిధి ఐన పరమాత్మ సన్నిధిలో వసించడమే ఉపవాసం! విషానికి, విషయానికి విశేషమైన భేదం. విషం తిన్నవాణ్నే చంపుతుంది. కాని, శబ్దాది విషయాలు తమను కన్నవాణ్ని, మనసులో కేవలం అనుకున్నవాణ్ని కూడా కనికరించవు. కంటికి కునుకు లేకుండా చేస్తాయి. హతమారుస్తాయి. ‘ధ్యానం నిర్విషయం మనః’- మనస్సును విషయ కాలుష్య విహీనం చేసుకోవడమే
మ॥ ఉపవాసంబులడయ్యుటో, విషయ సంయోగంబు వర్జించుటో,
తపముంబూని చరించుటో, హరిపద ధ్యానంబునన్ నిల్చుటో,
యపలాపంబున నేల పొందితి, హతంబయ్యెం దపంబెల్లనీ
కపటి స్త్రీ పరిరంభముల్ మునులకుంగైవల్య సంసిద్ధులే?
వాస్తవ ధ్యానం! ‘తపమాచరించే వాడు, తత్తం తెలిసిన వాడు, మోక్షాన్ని కోరేవాడు ఎప్పుడూ ఏకాంతాన్నే అభిలషిస్తాడు. అది లేనిదే శ్రీకాంతుని యందు మది ఏకాగ్రం కాదు. నా వంటి కాపురుషుడు- మూర్ఖుడైన ముని మాత్రమే కాపురం- సంసార లంపటంలో చిక్కుకుంటాడు.’ మనస్సును అదుపు చేసే బుద్ధికే ‘మనీషా’ అని పేరు. మనసు వశమైతే కాని ఏకాగ్రత అలవడదు. అప్పుడే లక్ష్యా న్ని సాధించే దక్షత లభిస్తుంది.
ముముక్షువులు (మోక్షకాములు) మిథున వ్రతుల- సంసారాసక్తుల సాంగత్యం వదలాలి. బ్రహ్మచారి పశుపక్ష్యాదుల కలయికను కూడా కంటితో చూడరాదు. కడకు మనోనిగ్రహం కొరకై యువతుల దారు (కర్ర) విగ్రహాలను సైతం కాళ్లతో కూడా ముట్టరాదని, విషయ వాసనలను, పశు ప్రవృత్తులను రెచ్చగొట్టే గ్రామ్య- మలిన గీతాలను వినరాదని శ్రీమద్భాగవతం ఉద్ధవగీత. మనసు సంగాన్ని కోరే పక్షంలో భక్తులు, జ్ఞానులు, యోగులైన మహాత్ముల సాంగత్యమే- సత్సంగమే చెయ్యాలి. భోగ ప్రియత్వం జనన మరణ రూప సంసారానికి హేతువు. భగవత్ ప్రియత్వం మోక్ష కారణం. భోగాసక్తి పెరిగేకొద్దీ బుద్ధిలో జడత్వం పెరుగుతూ పోతుంది. దాని వలన సత్సంగంలో తాత్త్విక విషయాను పలుమార్లు వినికూడా శ్రోత గ్రహించలేడు- అవి అర్థం కావు. పై ఆధ్యాత్మిక సిద్ధాంత, సూత్రాలన్నిటికీ జ్వలంతమైన దృష్టాంతం సౌభరి వృత్తాంతం.
ఆ॥ తపము సేయువాడుఁ దత్తజ్ఞుడగు వాడు
నెలమి మోక్షమిచ్చ నెంచువాడు
నేకతంబు విడిచి యేర్పడ నేరఁడు
కాపురంబు సేయుఁగరటి తపసి
శుకయోగి- రాజా! పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అంటారు. సౌభరి నిర్వేదంతో తన్నుతాను నిందించుకొని, ‘కామము’ యొక్క పనితనాన్ని, తన పతనాన్ని తెలుసుకొని ఇహపరసాధనకై సంసార జంజాటాన్ని వదిలించుకొన్నాడు. వానప్రస్థాన్ని వరించి అర్ధాంగులతో అడవికి వెళ్లాడు. ఘోరతపస్సు చేసి మార (కామ) విజయం సాధించి సాయుజ్య ముక్తి (భగవదైక్యత)ని ప్రాప్తించాడు. అగ్నిజ్వాలలు శాంతించిన అగ్నిలోనే లయించినట్లు సౌభరి పత్నులు కూడా పతి ప్రభావంతో సతీత్వం- పాతివ్రత్యం పొంది ఆయనలోనే లీనమయ్యారు- ఆయన పొందిన పరమగతినే చెందారు.
సౌభరి మహర్షి తపస్సాధనలో జరిగిన అపథ్యానికి, కలిగిన అపశ్రుతికి గొప్ప నేపథ్యమే ఉంది. ఆయన విష్ణు భక్తుడు, వాహనుడూ ఐన వైనతేయు (గరుత్మంతు)ని పట్ల అపచారం- అపరాధం చేశాడు. దాని ఫలితమే ముని జీవితంలో చోటు చేసుకొని, చేటు కలిగించిన అనాచారం. గరుత్మంతుడు అప్పుడప్పుడూ యమునలోని జలచరాలను- చేపలను, పాములను భక్షిస్తూ ఉండేవాడు. అవన్నీ సౌభరితో మొరపెట్టుకున్నాయి. ‘గరుడా! నీవు ఈ మడుగు వద్దకు వస్తే మరణింతువు గాక’ అని ముని అతనిని శపించాడు. ఎంతైనా పక్షిరాజు భక్త పక్షపాతి ఐన లక్ష్మీపతి పరమభక్తుడు కదా! అది భాగవత అపచారమైంది. భక్తిశాస్త్ర ప్రకారం భగవదపచారం కన్నా భాగవతాపచారం మిక్కిలి భయంకరం! సౌభరి శాపానికి రెండు అనర్థాలు దాపురించినై- ఒకటి, కాళింది (యమున)లో గరుడుని స్థానంలో కరాళమైన కాళీయుడు వచ్చి చేరాడు. రెండవది- భక్తుని శపించినందుకు సౌభరి సంసారాసక్తుడై తపస్సు వ్యర్థం చేసుకొన్నాడు. చివరిగా, తనను తాను ఎన్నటికీ సిద్ధ పురుషునిగా భావించరాదు. సదా సాధకునిగానే భావించాలి. సిద్ధునిగా తలచిన ప్రబుద్ధుడు సౌభరి వలెనే మోసపోగలడు! (సశేషం)