ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలు ఇవే.. !

 ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష ఉత్సవాలు ఇవే.. !

తిరుమల : తిరుమల ( Tirumala ) శ్రీ  వేంకటేశ్వర స్వామికి ఏటా నిర్వహించే ఉత్సవాలతో పాటు మాసం వారిగా జరిపే విశేష ఉత్సవాలను టీటీడీ అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాల వివరాలను ప్రకటించారు. తిరుమల దిగువన తిరుపతిలో శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఆగస్టు నెలలో జరిగే ఉత్సవాలను సైతం వెల్లడించారు.

తిరుమలలో ఆగస్టు 1న పౌర్ణమి గరుడ సేవ (Garuda Seva), ఆగస్టు 12న మతత్రయ ఏకాదశిని నిర్వహిస్తున్నట్లు వివరించారు. 15న భారత స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, శ్రీ ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్ర ఉత్సవాలను జరుపుతున్నామని పేర్కొన్నారు. 21న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ, 22న కల్కి జయంతి (Kalki Jayanti ), ఆగస్టు 25న తరిగొండ వెంగమాంబ వర్ధంతి, వరలక్ష్మీ వ్రతం, 26న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు, 30న శ్రీ విఖనస మహాముని జయంతి, శ్రావణపౌర్ణమి. రాఖీ పండుగ, 31న హయగ్రీవ జయంతి, తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

ఆగస్టు 1, 31న పౌర్ణమి సందర్భంగా  తిరుపతి శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో ఉద‌యం 9 గంట‌ల‌కు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారిని ఆల‌య నాలుగు మాడ వీధుల ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆగస్టు 5, 12, 19, 26వ తేదీల్లో శనివారం సంద‌ర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 6 గంట‌లకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, ఆలయంలో ఊంజల్‌సేవను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆగస్టు 14న పున‌ర్వసు న‌క్షత్రాన్ని పుర‌స్కరించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం, సాయంత్రం 5.30 గంట‌ల‌కు రామ‌చంద్ర పుష్కరిణి వ‌ద్ద ఊంజ‌ల్ సేవను నిర్వహిస్తామని వారు తెలిపారు. ఆగస్టు 16న అమావాస్య సందర్భంగా ఆలయంలో ఉదయం 7 గంట‌ల‌కు సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రాత్రి 7 గంట‌ల‌కు శ్రీ కోదండరామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఉంటుందని వెల్లడంచారు.

Digiqole Ad

Related post