హైదరాబాద్‌కు డ్రైవర్ లేకుండా నడిచే బస్సులు.. అందుబాటులోకి సేవలు..!
హైదరాబాద్‌లో డ్రైవర్ లేకుండానే నడిచే మినీ బస్సులు సందడి చేస్తున్నాయి. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ఈ విద్యుత్ బస్సులు, అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్నాయి. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి.
సాంకేతికతలో మరో ముందడుగు పడింది. డ్రైవర్ అవసరం లేని మినీ బస్సులు ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి ప్రస్తుతం ప్రజల కోసం కాకుండా వినియోగంలో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘అటానమస్ నావిగేషన్ డేటా అక్విజిషన్ సిస్టం’ (Autonomous Navigation Data Acquisition System) సాంకేతికతను ఉపయోగించి ఈ బస్సులను తయారు చేశారు. ఈ ఆవిష్కరణతో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ రహిత బస్సులను అందుబాటులోకి తెచ్చిన సంస్థగా ఐఐటీ హైదరాబాద్ నిలిచింది.
ఐఐటీ హైదరాబాద్‌లోని ప్రత్యేక పరిశోధనా విభాగం ‘టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (TiHAN)’ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. ఈ బస్సులు పూర్తిగా విద్యుత్తుతో నడుస్తాయి. ప్రస్తుతం క్యాంపస్‌లో ఆరు సీట్లు, పద్నాలుగు సీట్లు కలిగిన రెండు రకాల బస్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని విద్యార్థులు, అధ్యాపకులు క్యాంపస్ ప్రధాన గేటు నుంచి వివిధ ప్రదేశాలకు ప్రయాణించడానికి ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ బస్సుల్లో ప్రయాణించిన వారిలో 90 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారని టీహన్ తెలిపింది.
డ్రైవర్ రహిత బస్సుల్లో ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ బస్సుల్లో అమర్చిన అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ , అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్ (Adaptive Cruise Control System) వంటి అత్యాధునిక సాంకేతికతలు బస్సు వేగాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రయాణ సమయంలో బస్సుకు ఏదైనా అడ్డువస్తే, అందులోని దానిని గుర్తించి, బస్సును సురక్షితమైన మార్గంలో ప్రయాణించేలా చేస్తుంది. ఈ బస్సుల ద్వారా భవిష్యత్తులో నగరంలోని రద్దీని తగ్గించడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేకూరుతుందని భావిస్తున్నారు.