హనుమాన్ MOVIE

 హనుమాన్ MOVIE

Cast – Teja Sajja, Varalaxmi Sarathkumar, Amritha Aiyer, Vinay Rai, Samuthirakani, Vennela Kishore, Getup Srinu, Satya

Director – Prasanth Varma

Producer – S. Niranjan Reddy

Banner – Prime Show Entertainment

Music – Gowra Hari, Anudeep Dev, Krishna Saurabh

ఒక చిన్న సినిమా రిలీజ్ కు ముందు రోజు ప్రీమియర్లు వేస్తే బాహుబలి 2 తర్వాతి స్థానాన్ని అందుకుంటుందని ఎవరైనా ఊహిస్తారా. హనుమాన్ విషయంలో అది జరగడం చూసి ట్రేడ్ ఆశ్చర్యపోయింది. పదుల సంఖ్యలో ఈవెనింగ్ షోలు చాలనుకుంటే ఏకంగా అవి వందలు దాటిపోవడం అనూహ్యం. పండగకు రెండు రోజులు ముందుగానే నిర్మాతలు ఇంత రిస్క్ చేయడం చూసి సందేహపడిన వాళ్ళు లేకపోలేదు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ గ్రాండ్ ఓపెనింగ్ దక్కించుకున్న హనుమంతుడు గెలిచాడా లేదా

కథ

సుదూర తీరంలో ఎత్తయిన కొండలపైన ఉండే అంజనాద్రి గ్రామంలో హనుమంతు(తేజ సజ్జ) పనీపాటా లేకుండా అక్క(వరలక్ష్మి శరత్ కుమార్)సంపాదన మీద బ్రతుకుతూ ఉంటాడు. ఓ అనూహ్య సంఘటన వల్ల మహిమ గల మణి దొరికి అతనికి కొండలు పిండి చేసి పడేసేంత అతీత శక్తులు వస్తాయి. సూపర్ హీరో అయిపోయి ప్రపంచాన్ని శాశించాలని కలలు కంటున్న మైఖేల్(వినయ్ వర్మ)కి హనుమంతు గురించి తెలిసి మణి కోసం కుట్ర చేసి ఆ ఊరిలో పాగా వేస్తాడు. ఇతన్ని మంచివాడిగా భ్రమించిన ఊరి జనం ఆశ్రయం ఇస్తారు. అసలు సమస్యలు అక్కడి నుంచి మొదలవుతాయి. మంచికి చెడుకి జరిగిన యుద్ధంలో చివరికి గెలుపెవరిదో తెరమీద చూడాలి.

విశ్లేషణ

హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు చూసి ఆహా ఓహో అంటూ మురిసిపోయే ఇప్పటి తరానికి రామాయణ భారతాల గొప్పదనం గురించి తెలియడం ఏమో కానీ వాటి మీద కనీస అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అందుకే మన భాష రాని విదేశీ కథానాయకులను నెత్తిన బెట్టుకోవడం కన్నా నిత్యం పూజించాల్సిన రామభక్త హనుమంతుడు లాంటి అద్భుత శక్తినే హీరోగా చూపిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన నిజంగా గొప్పది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆ కోణంలోనే తన సినిమాటిక్ యునివర్స్ ని సృష్టించాలనే లక్ష్యంతో మొదటి అడుగుని హనుమాన్ రూపంలో వేశాడు. దీని విజువల్ ఎఫెక్ట్స్ కోసం తగినంత హోమ్ వర్క్ చేసిన వైనం తెరమీద కనిపిస్తుంది.

స్టోరీ పరంగా చూసుకుంటే ఇందులో మరీ కనివిని ఎరుగని పాయింట్ ఏమి లేదు. ఆ మాటకొస్తే అంజిలో ఆత్మలింగం ఇక్కడ మణిబాబుగా మారింది. శ్రీ ఆంజనేయంలోని భయపడే హీరో ఇందులో గాలికి తిరిగే జులాయిగా కనిపించాడు. వాటిలో లేని ఒక ఊహాతీత ప్రపంచాన్ని ప్రశాంత్ వర్మ చక్కగా సృష్టించాడు. హనుమంతుకో అక్కయ్యని పెట్టి ఎమోషనల్ యాంగిల్ వాడుకున్నాడు. అన్యాయంగా పన్ను వసూలు చేసే ఒక కుస్తీ పైల్వాన్ ని లోకల్ విలన్ గా మార్చాడు. వర్తమానంలో ఉన్నట్టు చూపిస్తూనే దేవుడు కాని విభీషణుడిని తీసుకొచ్చి మధ్యవర్తిగా మార్చాడు. ఇలా తెలివిగా పాత్రలను కూర్చుకుని కొత్త అనుభూతిని ఇవ్వాలని తాపత్రయపడ్డాడు.

మాములు మనిషికి అతీత శక్తులు రావడం చాలాసార్లు చూశాం. హనుమాన్ లో వ్యత్యాసం ఆ పాయింట్ లో చూపించడు ప్రశాంత్ వర్మ. మనకు కనిపించని బలం హనుమంతుడి రూపంలో నిత్యం మన చుట్టూ ఉంటుందనే థ్రెడ్ చుట్టూ తేజ సజ్జ క్యారెక్టర్ ని రాసుకున్నాడు. సూపర్ హీరోగా మారిపోవాలని చూసే ఒక అత్యాశపరుడిని విలన్ గా మార్చి, వాళ్ళిద్దరి మధ్య యుద్ధాన్ని ఊరికి ముడిపెట్టి, మధ్యలో హనుమంతుడి సహాయాన్ని తీసుకోవడం మెయిన్ ప్లాట్. వినడానికి బాగానే ఉంది కానీ హనుమంతు, మైఖేల్ ల మధ్య సంఘర్షణని ఒకే టోన్ లో తీసుకెళ్లడం వల్ల గొప్పగా ఆశించే హై మూమెంట్స్ తగ్గిపోయాయి. దాని ప్రభావమే కొంత ల్యాగ్ కు కారణమయ్యింది.

టెక్నికల్ గా హనుమాన్ ని ఉన్నతంగా నిలబెట్టాడు ప్రశాంత్ వర్మ. తనలో రైటర్ కన్నా డైరెక్టర్ స్ట్రాంగ్. ఇందులోనూ అది బయట పడింది. విలన్ మణి కోసం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడినప్పుడు అతను చేసే దుర్మార్గాలు, హీరో వాటిని ఎదిరించడం ద్వారా డ్రామాను పెంచుతూ పోవాలి. గూస్ బంప్స్ అనిపించేవి క్రమం తప్పకుండా వస్తూ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ కళ్ళు తిప్పుకోకుండా చూస్తారు. రాజమౌళి ఈ విషయంలో మాస్టర్ డిగ్రీ చేశారు. ప్రశాంత్ వర్మ కూడా అదే బాటలో వెళ్లేందుకు ట్రై చేశాడు. ఒకదశలో కొన్ని పొరపాట్లు కూడా చేశాడు. ఉదాహరణకు రెండు సార్లు హీరోయిన్ మీద హత్య ప్రయత్నం జరగడం లాంటివి లెన్త్ కోసమే అనిపిస్తాయి.

ఎప్పుడైతే హీరో విలన్ ఫేస్ టు ఫేస్ క్లాష్ మొదలవుతుందో అక్కడి నుంచి స్పీడో మీటర్ పెరగాలి. ఊహించేలా కథ ఉన్నప్పుడు ఊహాతీతంగా మలుపులు జరగాలి. అదే సక్సెస్ ఫార్ములా. హనుమాన్ ఈ విషయంలో కొన్ని కుదుపులకు గురైంది. హనుమంతుకి సూపర్ పవర్స్ వచ్చాక, హీరో విలన్ ఫేస్ టు ఫేస్ క్లాష్ జరిగాక ఎగ్జైట్ చేసే పోరాటలు, షాక్ అనిపించే సన్నివేశాలు ఆశిస్తాం. అవసరం లేని ప్రేమకథ, ఒక లీడ్ క్యారెక్టర్ చావు, ఎమోషన్ కోసం ట్రాజెడీ సాంగ్ కొంత సాగతీతకే దారి తీశాయి. అయినా సరే ఇవన్నీ క్షమించేలాగే ప్రశాంత్ వర్మ నడిపించిన తీరు గట్టెక్కించింది. ఎక్కడో మూలాన ఉన్న అనుమానాన్ని క్లైమాక్స్ పూర్తిగా తుడిచేస్తుంది.

భక్తి ఎప్పటికైనా తిరుగులేని భావోద్వేగం. దాన్ని సరైన రీతిలో వాడుకుంటే బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తుంది. అమ్మోరు, దేవుళ్ళు లాంటి విజయాలే సాక్ష్యం. హనుమాన్ అదే కోవలోకి చేరుతుందో లేదో ఠక్కున చెప్పలేం కానీ వాటిలో సగానికి పైగా లక్షణాలు పుణికి పుచ్చుకుంది కాబట్టి పబ్లిక్ కి నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అప్ అండ్ డౌన్స్ నుంచి ప్రశాంత్ వర్మ తప్పించుకోలేదు. వావ్ అనిపించేలా కాకపోయినా బాగుంది అనే ఫీలింగ్ కలిగిస్తూ ఎక్కడిక్కడ గ్రాఫ్ పడిన ప్రతిసారి మంచి ఎపిసోడ్ తో దాన్ని కవర్ చేసుకుంటూ ఫైనల్ గా అంచనాల బరువుని బాగానే మోయగలిగాడు. అది అద్భుతాలు చేసిందా అంటే సగం తలే ఉపగలం.

నటీనటులు

ప్రత్యేకంగా ఇమేజ్, ఫాలోయింగ్ అంటూ ఏదీ లేని ఎదిగే స్టేజిలో ఉన్న తేజ సజ్జకి ఇలాంటి పాత్ర దక్కడం అదృష్టమే. సెటిల్డ్ గా తన నుంచి పెర్ఫార్మన్స్ పరంగా ఏం కోరుకుంటున్నారో దాన్ని పరిపూర్ణంగా ఇచ్చాడు. అమృత అయ్యర్ కి కొంత ప్రాధాన్యం దక్కింది. ఉన్నంతలో ఓకే. అక్కగా వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి బలంగా నిలిచింది. విలన్ గా వినయ్ వర్మ నప్పాడు కానీ ఇంకొంత బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. అయినా నిరాశపరచలేదు. కామెడీ కాకుండా కొంచెం సీరియస్ టచ్ తో వెన్నెల కిషోర్ డిఫరెంట్ గా అనిపిస్తాడు. గెటప్ శీను, సత్య నవ్వించారు. సముతిరఖని లిమిటెడ్ గా అయినా మెప్పించాడు. దీపక్ శెట్టి తదితరులు డీసెంట్.

సాంకేతిక వర్గం

గౌర హరి నేపధ్య సంగీతం హనుమాన్ కి ప్రాణంగా నిలిచింది. స్తోత్రాలు, చాలీసాలను సందర్భానుసారంగా వాడుకుంటూ ఇచ్చిన స్కోర్ ఎలివేషన్ కి ఉపయోగపడటంతో పాటు స్టోరీకి తగ్గ ఆధ్యాత్మికతను ఇవ్వడంలో దోహదపడింది. తనతో పాటు పాటలను కంపోజ్ చేసిన అనుదీప్ దేవ్ – కృష్ణ సౌరభ్ ల ఆల్బమ్ పర్వాలేదు. రెండు సాంగ్స్ బాగున్నాయి. శివేంద్ర దాశరథి ఛాయాగ్రహణం పరిమితులను దాటుకుని మరీ అత్యున్నత స్థాయిలో పనితనం చూపించింది. సాయిబాబు తలారి ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉండాల్సింది. రచనా బాధ్యతలు తీసుకున్న చేసిన స్క్రిప్ట్ విల్లే బృందాన్ని అభినందించవచ్చు. ప్రైమ్ ఫోకస్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్

నటీనటులు
విజువల్ ఎఫెక్ట్స్
ఇంటర్వెల్, క్లైమాక్స్
నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్

కథనంలో హెచ్చుతగ్గులు
విలన్ క్యారెక్టరైజేషన్
సెకండ్ హాఫ్ లో కొంత తగ్గిన హై మూమెంట్స్

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *