హనుమంతుడికి వడమాల సమర్పిస్తే ఆ ఇద్దరు కూడా ప్రసన్నులవుతారట

ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన నైవేద్యం సమర్పించడం ఆచార సంప్రదాయాల్లో ఒకటి. హనుమంతుడికి వడమాల సమర్పించడం వల్ల ప్రసన్నమయ్యేది ఆంజనేయుడు ఒక్కరే కాదట! మరో ఇద్దరు కూడా ప్రసన్నులవుతారట.
దేవుళ్లకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తే వారు సంతోషించి శుభ ఫలితాలు అందిస్తారని భక్తుల నమ్మిక. ఉదాహరణకు గణేశుడికి ఉండ్రాళ్లను, లడ్డునూ నైవేద్యంగా పెడతాం. కృష్ణుడికి వెన్నను సమర్పిస్తాం. అలాగే పరమశివుడికి పాలతో అభిషేకం చేస్తాం. అలా వాయుపుత్రుడు హనుమంతుడికి మినుములు, మిరియాలతో చేసిన 108 వడలను నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అసలు కథ తెలియని వాళ్లు మినుములు బలమైన ఆహారం కాబట్టి అలా సమర్పిస్తుంటారని అనుకోవచ్చు. ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు కానీ, ఇలా వడమాలను సమర్పించడం వెనుక కొన్ని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయని మీకు తెలుసా..
హనుమంతుడు తన చిన్నతనంలో చేసిన చిలిపి చేష్టలు మనందరం వినే ఉంటాం. ఆ సమయంలో జరిగిన గాథనే ఈ వడమాల సమర్పించడం వెనుక కారణం.
ఆకలిగా ఉన్న సమయంలో ఎర్రగా కనిపిస్తున్న సూర్యుని చూసి పండుగా భ్రమిస్తాడు. ఆకాశంలోకి ఎగిరి ఆ ఎర్రటి పండు అందుకోవాలనే కుతూహలంతో వేగంగా వెళుతంటాడు. మరోవైపు గ్రహణ కాలం సమీపిస్తుండటంతో రాహువు సైతం సూర్యుడికి అడ్డుగా వస్తుంటాడు. అప్పటికే ఆకలి మంట మీద ఉన్న హనుమంతుడు తన త్రోవకు అడ్డువచ్చిన రాహువును ఒక్క తన్ను తన్ని పక్కకు పంపేస్తాడు
రాహువుకు జరిగిన అవమానం తెలుసుకున్న ఇంద్రుడు ఆవేశంతో రగిలిపోయి తన ఆయుధాన్ని సంధిస్తాడు. అది ఆంజనేయుని దవడకు తగులుతుంది. దవడను హను అని సంభోదిస్తారు కాబట్టి అప్పటి నుంచే ఆయనకు హనుమంతుడు అని పేరు వచ్చింది. అలా వాయుపుత్రుడైన హనుమంతునికి గాయం కావడంతో వాయుదేవుడు ఆగ్రహిస్తాడు. సమస్త లోకాల్లో పవనాలు వీచడాన్ని ఆపేస్తాడు. దాంతో దేవతలంతా దిగివచ్చి వాయుదేవుడ్ని శాంతింప జేసేందుకు ఆంజనేయుడికి తమ వద్దనున్న వరాలను ప్రసాదిస్తారు.
హనుమంతుని ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలు నైవేద్యంగా పెడితే వారి రాహుదోషాలను తొలగిపోతాయని చెప్పాడట. రాహువు చూడటానికి సర్పాకారంలో ఉంటాడు కాబట్టి వడలను మాల రూపంలో అందిస్తారు.హైందవ ధర్మంలో 108 అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి 108 వడలతో వడమాలను ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఉత్తర భారతదేశంలో మాత్రం హనుమంతుడిని ఆరాధించేందుకు వచ్చిన వారు రాహువును కూడా ప్రసన్నం చేసుకునేందుకు జిలేబి సమర్పిస్తుంటారు. కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే మినుములు, ఉప్పు, మిరియాలు కలిసిన వడలతో నైవేద్యం సమర్పిస్తుంటారు.
కేవలం రాహు దోషమే కాదు శని దోషం ఉన్న వారు కూడా హనుమంతుడికి వడలను నైవేద్యంగా సమర్పించి తమ దోష నివారణ జరగాలని కోరుకుంటారు. ప్రచారంలో ఉన్న కథేంటంటే, ఆంజనేయుడు పుట్టింది శనివారం. ఆ వారానికి అధిపతి శనీశ్వరుడు. కాబట్టి ఆ రోజు పుట్టిన హనుమంతునికి ఇష్టమైన మినుములు సమర్పిస్తే ఇద్దరి అనుగ్రహం దొరుకుతుందని నమ్మకం. శనీశ్వరుడికి నైవేద్యంగా నల్లటి వస్తువులలో దేనిని పెట్టినా ఆయనకు ప్రీతికరమే.