షర్మిళ మౌనానికి కారణం ఇదే… వీడేది ఎప్పుడంటే…?

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ పార్టీలన్నీ ఫూల్ యాక్టివ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అధికార బీఆరెస్స్ ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తుంటే… బీజేపీ నేతలు కూడా డబుల్ బెడ్ రూం ఇళ్ల సందర్శన అంటూ వార్తల్లో నిలిచారు. ఇదే సమయంలో టి.కాంగ్రెస్ నేతలు కూడా ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో షర్మిళ మాత్రం సైలంటుగా ఉన్నారు!
తెలంగాణ రాజకీయాల్లో భారీ పాదయాత్ర, ప్రభుత్వపై తీవ్రస్థాయిలో ఫైర్, పోలీసుల అరెస్టు సమయాల్లో జరిగిన రచ్చ, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ అనంతరం ముట్టడి కార్యక్రమాలతో తెలంగాణ రాజకీయాల్లో ఫుల్ హల్ చల్ చేసిన షర్మిల.. ఇటీవల కాలంలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మీడియా కంటికి కనిపించకున్నారు!
అవును… గత కొంతకాలంగా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా కేవలం ట్విట్టర్ కు పరిమితం అయ్యారు షర్మిల. అయితే ఈ నెల మొదట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున మాత్రం ఎన్నికల్లో పోటీపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో పక్కాగా పోటీచేయనున్నట్లు మరోసారి స్పష్టంచేశారు. పాలేరు నుంచే పోటీ చేస్తానని పేర్కొన్నారు.
ఆ ప్రకటన మినహా… గత కొంతకాలంగా ఆమె తెలంగాణలో ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడం లేదు. దీంతో పూర్తిగా తెర వెనుక రాజకీయాలకే పరిమితం అయ్యారని… ఇందులో భాగంగా… వైఎస్సార్టీపీనీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకే బిజీగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ లోక్ సభకు పోటీ చేయబోతున్నారని, ఈ మేరకు కేవీపీ పావులు కదుపుతున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే.
ఆ సంగతి అలా ఉంటే… మరోపక్క షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ కు అసలు ఇష్టం లేదని అంటున్నారు. ఆమె ఆంధ్ర ఆడపడుచంటూ రేవంత్ ఇప్పటికే తన అయిష్టతను బహిరంగంగానే వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. దీంతో… రేవంత్ ను కాదని కాంగ్రెస్ పార్టీతో పొత్తు / విలీనం విషయంలో షర్మిల తెరవెనుక రాజకీయంలో బిజీగా ఉన్నారని అంటున్నారు.
ఇప్పటికే కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో షర్మిళ నాలుగైదు సార్లు మంతనాలు పూర్తి చేశారని తెలుస్తుంది. మరోవైపు కేవీపీ రామచంద్రరావు సైతం ఆమెను కాంగ్రెస్ లోకి తేవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. ఇక ఢిల్లీలో రాహుల్ గాంధీనీ కలవడం ఒకటే మిగిలి ఉందని… ఆ పని కూడా పూర్తయిపోతే ఇక షర్మిల పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అయిపోతారని అంటున్నారు.
ఈ సమయంలో ఎలాంటి వివాదాలు, మరెలాంటి స్టేట్ మెంట్లూ ఇవ్వకుండా.. వీలైనంత వరకూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అదేవిధంగా… కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీని విలీనం చేయడం మాత్రమే ముఖ్యం కాదని.. అనంతరం పార్టీలో దొరికే సముచిత స్థానం అనేది కీలకం అని.. అందుకే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుందని తెలుస్తుంది.
అయితే ఒక్కసారి ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే… షర్మిళ సైలెన్స్, రేవంత్ వైలెన్స్ లు ఒకేసారి బ్రేక్ అవుతాయని అంటున్నారు పరిశీలకులు. మరి హస్తిన నుంచి ఫోన్ ఎప్పుడు వచ్చేది.. షర్మిళ సైలెన్స్ ఎప్పుడు బ్రేకయ్యేది.. రేవంత్ వైలెన్స్ సైలెన్స్ గా ఎప్పుడు మారేది అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే!