వైసీపీలో పదవుల జాతర

 వైసీపీలో పదవుల జాతర

కొన్ని పోస్టుల్లో సీనియర్లను నియమించినా మ్యాగ్జిమమ్ పోస్టుల్లో యువతనే నియమించాలని అనుకున్నారట.

ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే విషయమై జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. చిన్నా, పెద్దా అన్నీ కలిపి సుమారు 137 పోస్టులు భర్తీ చేయాల్సుంది. 2021లో ఒకేసారి పై పోస్టులన్నింటినీ జగన్ భర్తీ చేశారు. తర్వాత రెండేళ్ళకు కొందరి పదవులను పొడిగించారు, మరికొందరిని కొత్తవాళ్ళని నియమించారు. ఇపుడు వాళ్ళ పదవీకాలం కూడా అయిపోయింది. అంటే 137 పోస్టులు నియామకానికి రెడీగా ఉన్నాయి. షెడ్యూల్ ఎన్నికలు మరో తొమ్మిదినెలల్లోకి వచ్చేసింది. అంటే ఎన్నికలకు ముందు ఇపుడు చేయబోతున్న నియామకాలు చాలా కీలకమైనవనే అనుకోవాలి. గతంలో రెండుసార్లు భర్తీచేసినపుడు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి, మహిళల కోటాని పక్కాగా అమలుచేశారు.

తొందరలో చేయాలని అనుకుంటున్న భర్తీ కూడా మళ్ళీ అదే పద్దతిలో చేస్తారనటంలో సందేహంలేదు. ఇన్ని సంవత్సరాలుగా పార్టీకోసం కష్టపడుతున్న వారిని, రాబోయే ఎన్నికల్లో పోటీకి అర్హత ఉండి అవకాశం ఇవ్వలేకపోతున్నవారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. గతంలో భర్తీ చేసిన 137 పోస్టుల్లో 56 శాతం అంటే 76 పోస్టులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటి, మహిళలకే కేటాయించారు. మిగిలిన పోస్టులను ఇతరవర్గాలకు కేటాయించారు. మొత్తం పోస్టుల్లో మహిళలకు 68, మగవాళ్ళకు 67 పోస్టులు కేటాయించారు.

తొందరలో చేయబోయే భర్తీలో ప్రధానంగా యువతకు పెద్ద పీట వేయాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. కొన్ని పోస్టుల్లో సీనియర్లను నియమించినా మ్యాగ్జిమమ్ పోస్టుల్లో యువతనే నియమించాలని అనుకున్నారట. జిల్లాల వారీగా జాబితాలను కూడా జగన్ ఇప్పటికే తెప్పించుకున్నట్లు సమాచారం. ఇదే విషయమై శుక్ర, శనివారాల్లో పార్టీలోని ముఖ్యులతో సమావేశం అవబోతున్నారట. ఈ రెండు రోజుల సమావేశాల్లో పోస్టుల జాబితా దాదాపు ఫైనల్ అయిపోతుందనే అనుకుంటున్నారు. ఏదేమైనా ఎన్నికలకు ముందు జరగబోయే పోస్టుల భర్తీకి చాల ప్రాధాన్యత ఉందనే అనుకోవాలి. ఎందుకంటే ఇవే చివరి నియామకాలు కాబట్టి. పైగా ఇపుడు అపాయింట్ అవ్వబోయే వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో పెద్డ బాధ్యతలనే జగన్ మోపబోతున్నారు. అందుకనే ఈ పోస్టుల భర్తీ చాలా కీలకమని అనుకుంటున్నది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *